NARAYANA MURTHY: ప్రజల ఆకలి తీరుస్తున్న అన్నదాత.. పంట పండించి నష్టపోతున్న దయనీయ పరిస్థితి దేశంలో నెలకొందని.. సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో... ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 22వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దేశంలో అందరికన్నా ఎక్కువగా నష్టాలపాలవుతున్న రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. ప్రభుత్వాలను విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించటానికి యూపీఏ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. స్వామినాథన్ రైతులను ఆదుకోటానికి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా నివేదించినా అప్పటి యూపీఏ ప్రభుత్వం అమలుచేయలేదని ఆరోపించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మాట తప్పారని ఆయన ఆరోపించారు. ఆంధ్రజాతిని చులకనగా చూడొద్దన్నారు. దిల్లీలో న్యాయం కోసం ఆందోళన చేసిన రైతులపై కేసులు ఎత్తివేయాలనే ఆలోచన మోదీకి రాలేదని, అది చాలా బాధాకరమన్నారు. మద్దతు ధర కోసం గళమెత్తిన అన్నదాతలపై కేసులు ఎత్తివేయాలని నారాయణమూర్తి కోరారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి అన్నదాతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సీపీఎం పార్టీ నేతలు, రైతు సంఘం నాయకులు మహాసభల్లో పాల్గొన్నారు
ఇవీ చదవండి: