తెదేపా శ్రేణులపై ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని తెదేపా ధర్మవరం నియోజకవర్గ బాధ్యుడు పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నెల 24న అనంతపురం జిల్లా ముష్ఠికోవెల గ్రామంలో జరిగిన ఘటనపై తెదేపా శ్రేణులపై నమోదు చేసిన కేసు విషయమై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు ఆయన వెళ్లారు. తనతో పాటు మరో తొమ్మిది మందిపై వైకాపా వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, తమ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించకపోవడం సరికాదని శ్రీరామ్ అన్నారు. బాధిత తెదేపా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తే వైకాపా వారు కవ్వింపు చర్యలకు దిగి, దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు నమోదు చేయించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైకాపా వారిపై కూడా కేసు నమోదు చేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
వైకాపా, తెదేపా కార్యకర్తల వాగ్యుద్దం
పరిటాల శ్రీరామ్ పోలీస్ స్టేషన్‌కు రావడంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అందరినీ గేటు బయటకు పంపడంతో అక్కడే వేచి ఉన్నారు. ఈ దశలో అటుగా వెళ్తన్న పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు వారిని ఉద్దేశించి విమర్శలు చేయడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు ఇరువురిని అక్కడి నుంచి చెెదరగొట్టారు. కాగా కేసు విషయమై పోలీస్ స్టేషన్‌లో మాట్లాడేందుకు వస్తే వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు దిగడం దుర్మార్గమని పరిటాల శ్రీరామ్ విమర్శించారు. పోలీసు స్టేషన్ ముందే ఇలా ఉంటే.. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి: భార్యను చంపిన భర్త అరెస్టు