పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. జిల్లాలో 63 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. చిలమత్తూరు వైకాపా అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా వేశారు. మిగిలిన 62 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. వైకాపా 60, తెదేపా, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 841 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 50 ఏకగ్రీవమయ్యాయి. పది ప్రాంతాల్లో వాయిదా వేశారు. 781 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 713 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా 49 స్థానాల్లో విజయం సాధించింది.
ఎన్నికలకు దూరంగా తెదేపా
పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష తెదేపా ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించింది. అయితే గతేడాదే నామినేషన్ల పర్వం ముగియడంతో బ్యాలెట్ పత్రాల్లో ఆపార్టీ అభ్యర్థులు పేర్లు కూడా నమోదయ్యాయి. గతంలోనే 61 జడ్పీటీసీ, 767 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు ఎక్కడా ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. పోలింగ్ రోజు ఏజెంట్లను కూడా నియమించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా చాలామంది తెదేపా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు హాజరుకాకపోవడం గమనార్హం.
ప్రభావం చూపని భాజపా, జనసేన
పరిషత్తు ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీచేసినా ప్రభావం చూపలేకపోయాయి. ఈ రెండు పార్టీలు కలిసి 54 జడ్పీటీసీ, 200 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకున్నాయి. తెదేపా ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకోవడంలో ఆ రెండు పార్టీలు విఫలమైనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటితోపాటు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి. 14 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందడం విశేషం.
ఐదు డివిజన్లు.. 17 కేంద్రాలు
జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. మొత్తం 5 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 17 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత బ్యాలెట్ పత్రాల కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. జిల్లాలో మొదటగా పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె ఎంపీటీసీ ఫలితం ఉదయం 10 గంటలకే వెలువడింది. రాత్రి 7.30 గంటలకు పూర్తి ఫలితాలు వచ్చాయి.
భద్రత కట్టుదిట్టం
అక్కడక్కడా చిన్నపాటి ఘటనలు మినహాయిస్తే.. జిల్లాలో పరిషత్తు ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. 17 కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షణలో ముగ్గురు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 59 మంది సీఐలు, 135 మంది ఎస్సైలతో పాటు సివిల్, ఏఆర్ సిబ్బందితో కలిపి 2,440 మంది పోలీసులు, ఆరు ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 14 స్పెషల్ పార్టీ బృందాలతో బందోబస్తు నిర్వహించారు. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని 64 గ్రామాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
నిన్న సర్పంచి.. నేడు ఎంపీటీసీ
చిలమత్తూరు మండలం కొడికొండలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరపున లక్ష్మీదేవమ్మ విజయం సాధించారు. అయితే ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె కొడికొండ సర్పంచిగా ఎన్నికయ్యారు. గతేడాది మార్చిలో ఎంపీటీసీ స్థానానికి ఈమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గతంలో ఎంపీటీసీకి వేసిన నామపత్రం అలాగే ఉండటంతో బరిలో నిలిచి గెలుపొందారు. ఆమె ఏదో ఒక పదవి వదులుకోవాల్సి ఉంటుంది.
గోరంట్ల మండలంలోని వానవోలు తండా నుంచి సర్పంచిగా వైకాపా మద్దతుతో ఎన్నికైన పార్వతిబాయి ఎంపీటీసీ ఎన్నికల బరిలోనూ నిలిచారు. తెదేపా అభ్యర్థి కంటే 914 ఓట్లు ఆధిక్యం సాధించారు.
ఏజెంట్ల మధ్య వాగ్వాదం
అనంతపురంలోని కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామ ఓట్ల లెక్కింపులో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో తెదేపా అభ్యర్థి పారిజాతమ్మకు 17 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో వైకాపా ఏజెంట్లు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. దీనికి తెదేపా ఏజెంట్లు ఒప్పుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అదే సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. డీఎస్పీ రాఘవరెడ్డి అక్కడికి చేరుకుని ఆయనను అడ్డుకున్నారు. గొడవకు దిగిన ఏజెంట్లకు సర్దిచెప్పి రీకౌంటింగ్ జరిగేలా చూశారు. రీకౌంటింగ్‌లోనూ తెదేపా అభ్యర్థిని 26 ఓట్ల మెజారిటీ రావడంతో విజేతను ప్రకటించారు.
విడపనకల్లు మండలం పొలికి ఎంపీటీసీ తెదేపా అభ్యర్థి తిమ్మక్క 43 ఓట్లతో గెలుపొందారు. రీకౌంటింగ్ చేయాలని వైకాపా ఏజెంట్లు గొడవకు దిగారు. దీనికి తెదేపా ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
చిలమత్తూరు మండలం మొరసనపల్లి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో మొదట తెదేపా అభ్యర్థి మీనాక్షికి 804 ఓట్లు, వైకాపా అభ్యర్థి లక్ష్మీదేవికి 798 ఓట్లు వచ్చాయి. వైకాపా రీకౌంటింగ్‌కు పట్టుపట్టడంతో మళ్లీ లెక్కించారు. రీకౌంటింగ్‌లో వైకాపా అభ్యర్థికి ఒక ఓటు మెజారిటీ వచ్చినట్లు ప్రకటించారు.
అగళి జడ్పీటీసీ తెదేపా వశం
జిల్లాలో 60 జడ్పీటీసీ స్థానాలు వైకాపా కైవసం చేసుకోగా.. అగళి స్థానం తెదేపా ఖాతాలో చేరింది. ఈ మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 8 వైకాపా, 2 తెదేపా దక్కించుకున్నాయి. జడ్పీటీసీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి ఉమేశ్ 656 ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థి మహేంద్రపై గెలుపొందారు.
ఇదీచదవండి.