పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రాణం.. వారికి ఏ కష్టం రాకుండా పెంచి.. పెద్ద చేయాలనుకుంటారు. జీవితంలో తాము అనుభవించిన కష్టాలు తమ పిల్లలకు రావొద్దని.. కాయాకష్టం చేసి.. పిల్లలను చదివించి పెద్ద చేస్తారు. పిల్లలు గొప్పవాళ్లు కావాలని కలలు కంటారు. వాళ్లే ప్రాణంగా బతుకుతారు.. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. ఎందుకలా ప్రవర్తించారంటే..
అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన శివ అతని భార్య రెడ్డమ్మ కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు, పాప అంజలి(2) ఉంది. అంజలి పుట్టినప్పటి నుంచి నల్లగా ఉందనే కారణంతో అంజలి తండ్రి శివ నిత్యం తన భార్యతో గొడవకు దిగేవాడు. గురువారం మద్యం మత్తులో అంజలిని శివ గట్టిగా కొట్టడంతో చిన్నారి సృహ కోల్పోయింది.
వెంటనే అప్రమత్తమైన తల్లి రెడ్డమ్మ.. చిన్నారిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో చిన్నారిని శుక్రవారం అనంతపురం ఆస్పత్రికి తల్లి రెడ్డమ్మ తీసుకెళ్లింది. పరిస్థితి విషమించటంతో చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. శవ పంచనామా నిమిత్తం చిన్నారిని మార్చురీకి తరలించారు. అప్పటివరకు అక్కడే ఉన్న రెడ్డమ్మ.. పాప మృతి చెందిందని తెలిసిన వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది.
అభం శుభం తెలియని చిన్నారిని అనాథగా వదిలివేయడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందని అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మడకశిర పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది.
ఇదీ చదవండి