2020 జులై: సర్వజనాసుపత్రిలోని సాధారణ వైద్య చికిత్స వార్డు (మెడిసిన్) మహిళా విభాగంలో ఆక్సిజన్ పైపునకు లీకేజీ ఏర్పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కొవిడ్ రోగులు వైద్య చికిత్స పొందుతున్నారు. వెంటనే యంత్రాంగం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పట్లో పైపులైన్ సక్రమంగా ఏర్పాటు చేయలేదు. ప్రెజర్ గేజ్, రెగ్యులేటర్, ఫ్లో మీటర్లు.. వంటివి నెలకొల్పలేదు.
2021, మే 1: లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ప్రెజర్ రెగ్యులేటర్ పని చేయలేదు. దీంతో కొవిడ్ బాధితులకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే శనివారం పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు బాధితులు పేర్కొంటున్నారు.
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ప్రాణవాయువు వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. కొవిడ్ బాధితులకు సరిపడా వాయువు అందడం లేదు. దీంతో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, కొత్త పైపులైన్ల ఏర్పాటు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం జరగలేదన్న విమర్శలు వస్తున్నాయి. పైపులైన్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆక్సిజన్ ప్రెజర్ పెంచడం లేదు. 4.5 ఎల్‌బీఎస్ కంటే ప్రెజర్ పెంచితే పైపులైన్ లీకేజీ, పగిలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్న భయం పట్టుకుంది. ఫలితంగానే బాధితులకు ఆశించిన మేర ప్రాణవాయువు లభించడం లేదు. ఈ విషయంపై మత్తుమందు వైద్య విభాగం యంత్రాంగం సైతం ఆస్పత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం దిశగా అధికారులు చొరవచూపడం లేదు.
852 పడకలకు కనెక్షన్
సర్వజనాస్పత్రిలో 852 పడకలకు కనెక్షన్లు ఇచ్చారు. అన్నింటికీ ఆక్సిజన్ లైన్ వేశారు. ప్రస్తుతం 300 పడకలకే సరఫరా చేస్తున్నారు. రోజూ 7 లక్షల లీటర్ల దాకా ఖర్చవుతోంది. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ సామర్థ్యం 13 కిలోలీటర్లు ఉంది. ఒకసారి నింపితే మూడు నుంచి నాలుగు రోజులు సరఫరా చేయడానికి వీలుంది. ఇటీవల ట్యాంకు వద్ద ఉన్న ప్రెజర్ రెగ్యులేటర్ సరిగా లేకపోవడంతో కొత్తగా అమర్చారు. ఇప్పటికీ 4 నుంచి 4.5 ఎల్‌బీఎస్ స్థాయిలోనే ప్రెజర్ పెట్టారు. రోగులందరికీ ఇవ్వాలంటే ఈ సామర్థ్యం సరిపోదన్న అభిప్రాయం వైద్యుల నుంచే వ్యక్తమవుతోంది.
నిమిషానికి 60 లీటర్లు
వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్ బాధితుడికి నిమిషానికి 60 లీటర్ల ప్రాణవాయువు సరఫరా చేయాలి. అంతకంటే తగ్గితే ఊపిరి ఆడటం కష్టమేనని మత్తుమందు వైద్య నిపుణుడు చెబుతున్నారు. 300 మందికి నిమిషానికి 18,000 లీటర్ల వాయువు సరఫరా చేయాల్సిందే. ఈ స్థాయిలో సరఫరా కావాలంటే.. వార్డు ప్రెజర్ గేజ్ వద్ద కనీసం 5 ఎల్‌బీఎస్ ఉండాలని చెబుతున్నారు. కానీ 4.5 ఎల్‌బీఎస్ మించి సరఫరా కావడం లేదని తెలుస్తోంది.
ప్రెజర్ గేజ్.. వాల్స్ ఎక్కడ?
ఆస్పత్రిలో ప్రతి వార్డు వద్ద విధిగా ప్రెజర్ రెగ్యులేటర్, గేజ్, వాల్వ్, అలారం వంటి పరికరాలు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. కొన్ని వార్డుల వద్ద వీటిని ఏర్పాటు చేయలేదు. గతేడాది ఎఫ్‌ఎం వార్డులో మంటలు చెలరేగడానికి గేజ్ లేకపోవడమేనని తేల్చారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. ఆక్సిజన్ పైపులైన్ ఏర్పాటు చేసిన గుత్తేదారులు కొన్ని పరికరాలను అమర్చాల్సి ఉంది. ఫ్లో మీటర్లు సైతం ఏర్పాటు చేయలేదు.
ఎక్కడా సమస్య లేదు - వెంకటేశ్వరరావు, వైద్య పర్యవేక్షకుడు, సర్వజన వైద్యశాల
ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. ప్రెజర్‌పై కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటిని సరిచేస్తున్నాం. ఆక్సిజన్ అందలేదన్న సమస్యే ఉండదు. ప్రతి రోగికి కావాల్సినంత ప్రాణవాయువు అందిస్తున్నాం. చిన్నచిన్న సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
● లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ సామర్థ్యం : 13 కేఎల్
● మొత్తం కనెక్షన్లు : 852
● ఆక్సిజన్ వినియోగ పడకలు :300
● రోజూ ప్రాణవాయువు ఖర్చు : 7 లక్షల లీటర్లు
ప్రాణవాయువు గొట్టం
ఇవీ చదవండి: