RESPOND ON ETV BHARAT STORY : అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 35 మంది పారిశుద్ధ్య కార్మికులు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరి వేతనాల నుంచి మినహాయించిన ఈపీఎఫ్ సొమ్ముతో పాటు, ESI నుంచి అందాల్సిన ప్రయోజనాల కోసం వారి కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారి దయనీయ పరిస్థితి గురించి ఈటీవీ- ఈటీవీ భారత్‌లో కథనం ప్రసారం చేయగా.. దాని యూట్యూబ్ లింక్ దిల్లీ కేంద్ర కార్యాలయం వరకు చేరింది. అధికారులు తక్షణమే విచారణ చేయాలని కడపలోని EPF అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాలతో రికార్డులు పరిశీలించారు. కమిషనర్‌తో మాట్లాడి, మృతి చెందిన కార్మికులకు సంబంధించి వేతనాల నుంచి ఈపీఎఫ్ సొమ్ము మినహాయించిన వివరాలు ఇవ్వాలన్నారు.
"29 సంవత్సరాల నుంచి చాలిచాలనీ జీతంతో పనిచేస్తున్నాము. మాకు సరిపడ జీతాలు ఇవ్వడం లేదు. మా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ మాకు అందుబాటులో లేదు. 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు"-లక్ష్మీదేవి, కార్మికురాలు
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ఈటీవీలో ప్రసారమైన .. పారిశుధ్యం పేరుతో స్వాహా.. కథనానికి నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. కార్మిక సంఘాల ప్రతినిధుల్ని చర్చలకు ఆహ్వానించి చీపుర్లు, తట్టలు, ఇతర పరికరాలు లేని విషయం రచ్చ చేయవద్దని కోరారు. తమ వేతనంలో చీపుర్ల కోసమే నెలకు 4వందల వరకు వెచ్చిస్తున్నామని సంఘాల నేతలు అధికారులను నిలదీశారు.
"పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న ఇబ్బందులను దిల్లీ వరకు తీసుకెళ్లిన ఘనత ఈటీవీకి చెందుతుంది. దిల్లీ నుంచి ఓ అధికారి ఈపీఎఫ్ కమిషనర్‌కి ఫోన్ చేసి సమస్యలపై ఆరా తీశారు. ఈపీఎఫ్ కమిషనర్.. నగరపాలక కమిషనర్‌తో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మార్చి వరకూ సమయం అడిగారు"-నాగరాజు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షుడు
సంబంధిత కథనం: ఛీఛీ.. చీపుర్ల నిధులూ మింగేస్తున్నారు.. అనంతపురం కార్పొరేషన్ అవినీతి కథ
కోటి 18లక్షల రూపాయలతో కొనుగోలు చేశామని చెబుతున్న పారిశుధ్య పరికరాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కార్మికులకు అవసరమైన పారిశుద్ధ్య పరికరాలివ్వటానికి 2నెలల గడువు కావాలని కమిషనర్ చెప్పినట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. గడువులోపు తమ సమస్యల్ని పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: