కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా వణికిపోతుంటే... ఇది సాధారణ జ్వరమే అని మాట్లాడటం వల్లే నివారణ చర్యల్లో అలసత్వం నెలకొంటోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విపత్తు నియంత్రణలో పాలన విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ప్రభుత్వ చర్యలు, లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తలెత్తే పరిస్థితులు, రైతాంగం, చేనేత వృత్తి వారి కష్టాలు, వలస కూలీల బాధలపై నేతలతో పవన్ చర్చించారు. లాక్డౌన్ సడలింపు తరవాతే అసలు సవాల్ ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారని పవన్ పేర్కొన్నారు.
గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్లు రెడ్ జోన్ పరిధిలో రాకుండా చూసుకోవడమే పెద్ద పరీక్షగా చెప్పిన పవన్... ఈ విషయంలో రాష్ట్ర పాలన యంత్రాంగం చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. మన ఆరోగ్య శాఖ పటిష్టంగా లేకపోవడం వల్ల తలెత్తే దుష్ఫలితాలు కరోనాతో బయట పడుతున్నాయని విమర్శించారు. పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయంగా అయిపోయారని అన్నారు. అనంతపురానికి రావాల్సిన ప్రత్యేక నిధులు, ఇతర సాయాలపై, రైతులను ఆదుకొనే విధంగా చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా స్పందిద్దామన్నారు.
ఇదీ చదవండి: