ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్య పర్యవేక్షకుడిగా పని చేసేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. ప్రస్తుత వైద్య పర్యవేక్షకుడు ఆచార్య రామస్వామినాయక్ అనారోగ్య కారణాలతో తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ చంద్రుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా అనుమతి ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా ఈఎన్‌టీ హెచ్‌ఓడీ ఆచార్య నవీద్ అహమ్మద్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వు వెలువరించారు. శుక్రవారం ఆయన బాధ్యతలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఆయన బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. తనకు కూడా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయంటూ తిరస్కరించారు.
డీఎంఈ దృష్టికి తీసుకెళ్లినా..
సర్వజనాస్పత్రికి రెగ్యులర్ వైద్య పర్యవేక్షకుడిగా ఎవరూ రావడం లేదు. గుంటూరు వైద్య కళాశాలకు చెందిన ఆచార్య ఉదయ్‌కుమార్‌ను నియమించారు. ఆయన గత నెల ఇక్కడికి వచ్చి.... అదే రోజే కడప కళాశాల ప్రిన్సిపల్‌గా ఉత్తర్వు తీసుకుని వెళ్లిపోయారు. ఆచార్య రామస్వామినాయక్ ఎఫ్‌ఏసీగా పని చేస్తున్నారు. 2019 సెప్టెంబరులో బాధ్యతలు తీసుకున్నారు. వైద్య పర్యవేక్షకుడిగా బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయలేదన్న విషయాన్ని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి:
ఈటీవీ భారత్ కథనానికి స్పందన ..చూపు కోల్పోయిన శ్రీనిత్యకు సాయం