కరోనా పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఇంటికే పరిమితమైన పరిస్థితుల్లోనూ.. ప్రాణాలకు తెగించి మూడు పంటలు సాగుచేసిన గొప్ప ధీరుడు రైతన్న అని ప్రముఖ సినీనిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆగస్టు 15న విడుదల కానున్న రైతన్న సినిమా ప్రమోషన్లో భాగంగా అనంతపురానికి వచ్చిన నారాయణమూర్తికి.. రైతు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తమ రైతన్న సినిమాలో చూపామన్నారు. భారీ సినిమాలు మాత్రమే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయని, ఇది కేవలం 20 శాతం మాత్రమే ఉందన్నారు. 80శాతం సినిమాలు సగటు, సామాన్యుడికి అందుబాటు సినిమాలేనని, ఇలాంటి వాటిని ఓటీటీ సంస్థలు కొనటంలేదన్నారు. థియేటర్లలో ధరలు పెంచటం అధికారిక బ్లాక్ మార్కెటింగ్‌గా ఆయన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరలు పెంచుకునే పాత జీఓను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటం హర్షణీయమన్నారు. రైతన్న సినిమాను అందరూ ఆదరించాలని నారాయణమూర్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ.. Paddy Purchase: రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: అచ్చెన్నాయుడు