Minister Savitha Said free DSC Coaching in AP : డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న నిరుద్యోగులకు మంత్రి సవిత గుడ్ న్యూస్ చెప్పారు. బీసీ స్డడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల పాటు ఇవ్వనున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో నిరుద్యోగులకు నెలకు 1,500 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తామని తెలిపారు. అలాగే మెటీరియల్ కోసం అదనంగా మరో రూ.1000 ఇస్తామని వివరించారు. ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఇవ్వనున్నామని రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.
ఈ నెల 16 నుంచి ప్రారంభం : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెెంటనే సీఎం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 16 నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నెల 30న డీఎస్సీ నోటిఫికేషన్ - వారికి టెట్ పరీక్ష! - AP DSC Notification 2024
ప్రతి సెంటర్లో 200 మంది అభ్యర్థులు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరులో డీఎస్సీ కోచింగ్ సెంటర్లను తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కోచింగ్ సెంటర్లో 200 మంది అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 వేల 200 మందికి కోచింగ్ ఇస్తామని వెల్లడించారు. ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామన్నారు.
బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లు : నిష్ణాతులైన అధ్యాపకులు ఆయా సబ్జెక్టులు బోధిస్తారని మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.73,720 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కేటాయించారన్నారు. అందులో బీసీ సంక్షేమానికి రూ.39 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు.