Vastu Remedies For Family Problems : ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేర్చుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. కొంత మంది బిల్డర్ కట్టిన ఇళ్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ అభిరుచులు, ఆసక్తి మేరకు విభిన్న డిజైన్లలో ఇంటిని నిర్మించుకుంటారు. అయితే, ఎంతో ముచ్చటపడి లక్షలు పోసి కట్టుకున్న లేదు కొనుగోలు చేసిన ఇళ్లకు వాస్తు దోషాలున్నాయని ఎవరైనా చెప్తే ఆందోళనకు గురవుతారు. అలాంటి వారి కోసం ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ మూడు పరిహారాలు తెలిపారు.
'ఏం చేసినా మీ కష్టాలు పోవడం లేదా? - ఫైనల్గా ఇంట్లో ఆ మూలన దీపం వెలిగించి చూడండి!'
ఈ రోజుల్లో వందకు 80శాతం ఇళ్లకు వాస్తు సమస్యలు, వాస్తు దోషాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. వాస్తు దోషాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ఎన్ని పరిహారాలు చేసినా అవి తొలగిపోవడం లేదని బాధపడే వారు తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా వాస్తు తంత్రాలు పాటించాలని సూచించారు. ఈ వాస్తు తంత్రాలు పాటించడం వల్ల వాస్తు దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. అవేంటే చూద్దామా!
మొదటి పరిహారం
సముద్రపు ఉప్పు ఒక గాజు గ్లాసు లేదా సీసాలో పోసుకోవాలి. మూత బిగించి ఇంటి లోపల నైరుతి (దక్షిణం, పడమర క్రాస్)లో ఉంచుకోవాలి. సముద్రపు ఉప్పుకు అన్ని వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది.
పెద్ద పెద్ద వాస్తు దోషాలున్నా, భవనం పడగొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నా, ఇల్లు రీ మోడల్ చేయాల్సి వచ్చినా మరో అద్భుత పరిష్కారం ఉందని మాచిరాజు వెల్లడించారు. ఇంద్రజాల్ మొక్క ద్వారా వాస్తు సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుందన్నారు. 'ఇది ఆకులు లేని మొక్క. కేవలం కొమ్మలు, రెమ్మలు మాత్రమే ఉంటాయి. చాలా శక్తి వంతమైన తాంత్రిక మొక్క. ఇది ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది అందరికీ దొరకదు. అలాంటపుడు ప్రత్యామ్నాయంగా కల్ప వృక్ష నారీ కేళ పరిహారం ఉంది'. అని వివరించారు.
రెండో పరిహారం
కొబ్బరి చెట్టుపై కాయలు వాటంతట అవే రాలిపడినపుడు తెచ్చుకోవాలి. నీళ్లతో శుభ్రం చేసి పసుపు రాసి, కుంకుమ, గంధం బొట్లతో అలంకరించాలి. దానిని ఎరుపు రంగు వస్త్రంలో ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే దానిని కల్ప వృక్ష నారీ కేళం అని అంటారు.
మూడో పరిహారం
ఇంట్లో ఎక్కువగా వాస్తు దోషాలు ఉంటే చింతలు తీర్చే చింత కొమ్మ తాంత్రిక పరిహారం పాటించాలని తాంత్రిక గ్రంథాల్లో తెలిపారని మాచిరాజు వెల్లడించారు. 'ఎప్పుడైనా, ఏ రోజైనా చిత్తా నక్షత్రం ఉన్నపుడు చింత చెట్టు దగ్గరికి వెళ్లాలి. పల్లెటూళ్లలో ఎక్కడపడితే అక్కడ చింత చెట్లు ఉంటాయి. అక్కడక్కడా హైవేల వెంట కూడా చింత చెట్లు ఉన్నాయి. చెట్టుదగ్గరికి వెళ్లి ఉత్తరం దిశగా పెరుగుతున్న ఓ చిన్న కొమ్మను వెంటతెచ్చుకోవాలి. దీనిని పూజ గదిలో పెట్టుకోవాలి. చిత్తా నక్షత్రం నుంచి మళ్లీ పూర్వాషాడ నక్షత్రం వచ్చే వరకూ పూజ గదిలోనే ఉంచాలి.' అని వివరించారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"రథ సప్తమి పూజా విధానం - ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి!"