CM Chandrababu Speech in National Education Day Program: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులదని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎ.కన్వెన్షన్‌లో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ హాజరయ్యారు. తల్లిదండ్రులు తరువాత గురువు ఎప్పటికి గుర్తు ఉంటారన్నారు. తనకు విద్య నేర్పిన గురువు ఇప్పటికీ గుర్తేనని సీఎం గుర్తుచేసుకున్నారు. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే నేటి యువత ఐఐటీలో రాణిస్తున్నారని, 1953లో యూజీసీ తీసుకువచ్చి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చారని అన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారని సీఎం అన్నారు. ఒక మంచి టీచర్ ఎప్పటికి మంచి టీచరేనని, అది మన ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు. తాను సీఎంగా అప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని భావించానని, ప్రపంచం మొత్తం తిరిగి ఐటీ కంపెనీలు తెచ్చానని అన్నారు. ఇంగ్లీషు ఉంటేనే భవిష్యత్తు అనే కొత్త థియరీ ఇప్పుడు తెచ్చారని కానీ మన మాతృ భాషకే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. అప్పుడే అన్ని విధాలా రాణించే అవకాశం ఉంటుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారు: టెక్నాలజీ వల్ల కొత్త టెన్షన్లు వస్తున్నాయని, కనీసం కుటుంబ సభ్యులతో కూడా గడపలేక గొడవలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యూపీ, బీహార్‌తో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే పిల్లలను కనడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. మన జనాభాను పెంచుకోవడం ద్వారా 2047లో మన వాళ్లే అన్నిచోట్లా రాణించే వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు ఇటువంటి అంశాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.
ఏపీలో టాటాపవర్ రూ.40 వేల కోట్ల పెట్టుబడి - టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం భేటీ
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: విజయవాడలో వరదల వల్ల ఈ కార్యక్రమం నిర్ణీత సమయంలో నిర్వహించ లేకపోయామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులుకు తగిన గౌరవం ఇస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ శాఖ అవసరమా వద్దు అని చాలా మంది చెప్పారని, కేజీ నుంచి పీజీ వరకు మార్పులు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తానని తేల్చిచెప్పారు. త్వరలో మన విద్యా విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
మార్కులు, ర్యాంక్స్‌తో పాటు విలువలతో కూడిన విద్య చాలా అవసరమని, సమాజానికి ఉత్తమ పౌరులు అందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని మంత్రి గుర్తుచేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఫొటోలు, పేర్లు, రంగుల పిచ్చి మనం చూశామని, రాజకీయాలకు అతీతంగా మన విద్యా విధానం ఉండాలని ఆకాంక్షించారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తీరు వల్ల 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారని వివరించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు లోకేశ్ తెలిపారు. రెండేళ్లు కష్ట పడితే మన విద్యా వ్యవస్థ దేశంలోనే నెంబర్ 1గా ఉంటుందని మంత్రి లోకేశ్ ఉద్ఘాటించారు.
తాడేపల్లి కార్యాలయం నుంచే పోస్టులన్నీ పెట్టారు: డీఐజీ
జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది:అయ్యన్నపాత్రుడు