Lokesh Yuvagalam Padayatra: రాజకీయాల్లో లక్ష్మణ రేఖ ఉంటుందని.. దాన్ని ఎవరూ దాటకూడదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 68వ రోజుకు చేరుకుంది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలోనే తూట్రాలపల్లిలో భోజన విరామ సమయంలో రెడ్డి సామాజిక వర్గీయులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఏనాడూ వ్యక్తిగతంగా దూషించుకోలేదని.. ఇద్దరూ పరస్పరం గౌరవంగా మెలిగారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు దిగజారాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీలో కులం, మతం, ప్రాంతం అంటూ తేడాలేమీ ఉండవని.. కేవలం రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయడమే తమ పార్టీకి తెలుసని లోకేశ్ స్పష్టం చేశారు.
జగన్ వల్ల రాష్ట్రం పరువు పోయింది: తాడిపత్రిలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసన్న లోకేశ్.. ఏనాడైనా జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల ఇళ్లకు వెళ్లారా? అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల ఇళ్లకు వెళ్లి కుర్చీలో కూర్చున్నారా? అన్న లోకేశ్.. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అందరం కలిసే రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని సూచించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏనాడూ రాష్ట్రం పరువు తీయలేదని.. చంద్రబాబు అభివృద్ధి పనులను వై.ఎస్. కొనసాగించారన్నారు. కానీ జగన్ వల్ల రాష్ట్రం పరువు పోయిందని.. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులపై న్యాయపోరాటం చేస్తామని లోకేశ్ తేల్చిచెప్పారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని.. వ్యవస్థ శాశ్వతమన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
లోకేశ్‌కు రైతులు, నిరుద్యోగుల వినతి పత్రాలు: యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పి. కొట్టాలపల్లిలో.. రైతులు, నిరుద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రాలు అందజేశారు. వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని.. ఇటీవల ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు.. నేటికీ నష్టపరిహారం అంచనాలు సిద్ధం చేయలేదని పి.కొట్టాలపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న హామీ ఇచ్చి సీఎం జగన్ యువతను మోసం చేశారని కమ్మవారిపల్లి గ్రామ నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని వివరించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ వారికి హమీ ఇచ్చారు.
ఆర్మీ ఉద్యోగిపై హత్యాయత్నం.. వైసీపీ దుర్మార్గ పాలనకు పరాకాష్ట: వైసీపీ కక్షలకు అంతులేకుండా పోతోందని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో.. జాతరకు పరిటాల శ్రీరాంను ఆహ్వానించారనే అక్కసుతో ఆర్మీ ఉద్యోగి సమరసింహారెడ్డిపై హత్యాయత్నం చేయడం రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనకి పరాకాష్టని మండిపడ్డారు. ఆర్మీ ఉద్యోగిపై దాడి చేసిన జడ్పీ వైస్ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమరసింహారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ఇవీ చదవండి: