అనంతపురం జిల్లాలో పురపాలక సంస్థల ఎన్నికలకు నామపత్రాల దాఖలు ఘట్టం శుక్రవారంతో ముగిసింది. మొత్తం 8 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, ఒక నగర పాలక సంస్థ పరిధిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు నామపత్రాల దాఖలు కొలిక్కి వచ్చింది. కొన్నిచోట్ల బెదిరింపుల పర్వం కొనసాగినా నామపత్రాలు చెప్పుకోదగిన స్థాయిలోనే దాఖలయ్యాయి.
నేటి నుంచి పరిశీలన...
జిల్లాలో అన్ని పురపాలకాలు, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థలో 358 వార్డులు ఉన్నాయి. వాటన్నింటికీ కలిపి 2,536 నామపత్రాలు దాఖలయ్యాయి. నేటి నుంచి పరిశీలన ఉంటుంది. ఈనెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకూ నామపత్రాల ఉపసంహరణకు సమయం ఉంది. చివరికి ఎన్నికల బరిలో నిలిచేదెవరనే విషయంపై ఆరోజే స్పష్టత వస్తుంది.
ఏకగ్రీవ స్థానాలెక్కడో...?
పుర ఎన్నికలకు ఎన్ని నామపత్రాలు దాఖలయ్యాయో తెలిసింది. అయితే... ఏ మున్సిపాలిటీలో ఏ వార్డు ఏకగ్రీవం కానుందనే విషయం తెలియరాలేదు. ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నాలు చేశారు. ఆఖరికి బెదిరింపులకు దిగారు. నామపత్రాలు చించారు. అయినా ప్రతిపక్ష పార్టీ తరఫున నామినేషన్ వేసే అభ్యర్థులు ఎక్కడా తగ్గలేదు.
ఆశావహులు ఎక్కువే...
అనంతపురం కార్పొరేషన్, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, గుంతకల్లులో పోటీ ఎక్కువగా ఉంది. ఆశావహులంతా ప్రస్తుతానికి నామపత్రాలు దాఖలు చేశారు. ఇంకా ఏ పార్టీ నుంచీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందలేదు. నేడు, రేపట్లో ఇదంతా ఓ కొలిక్కి వస్తుంది. బీ-ఫారాలు అందిన వారు కాకుండా మిగిలిన వారు నామపత్రాలను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. వారిలో అసంతృప్తులెవరైనా ఉంటే రెబల్స్‌గా బరిలో నిలిచే వీలుంది. ఉపసంహరణ రోజు సాయంత్రానికి స్పష్టత వస్తుంది.
ఇదీ చదవండి : మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!