అనంతపురం జిల్లా జన్మభూమి రోడ్డులో నాగమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. భర్త 30 ఏళ్ల కిందటే మరణించాడు. దీంతో ఒంటరైన నాగమ్మ.. కుమారుల ఎదుగుదలే తన భవిష్యత్గా బతికింది. ఇద్దరు కుమారులను చదివించి, పెళ్లిళ్లు చేసింది. ఇద్దరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ భార్యబిడ్డలతో సంతోషంగా ఉన్నారు. ఇంతవరకు భాగానే ఉంది. ఆ తల్లి.. వయస్సు మీద పడటం, పని చేయలేని పరిస్థితికి చేరింది. ఇంకేముంది.. కుమారుల నిజస్వరూపాలు బయటపడ్డాయి. ఇద్దరు కూడా నా దగ్గర వద్దంటే.. నా దగ్గర వద్దంటూ తల్లిని గాలికొదిలేశారు. దీంతో ఆరు బయటే ఉంటూ.. తినడానికి తిండి లేక అలమటించిందా తల్లి.
విషయం తెలుసుకున్న నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. వృద్ధురాలి వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించి పరిస్థితిపై ఆరా తీశారు. 30 ఏళ్ల కిందట భర్త చనిపోతే పిల్లలను పెంచి పెద్ద చేసానని.., వారికి పెళ్లై, పిల్లలు పుట్టాక.. తన కుమారులు తనను పట్టించుకోవడం లేదంటూ నాగమ్మ కన్నీటి పర్యంతమైంది. స్పందించిన సీఐ శ్రీనివాసులు.. నాగమ్మ పెద్ద కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని మంచిగా చూసుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం కుమారుడితోపాటు నాగమ్మను ఇంటికి పంపించారు. సీఐ శ్రీనివాసులు తీసుకున్న చొరవకు స్థానికులు అభినందించారు.
ఇవీ చూడండి...