Mistakes in Uravakonda Constituency Voters List: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరు, బెలుగుప్ప మండలాల్లో ఓటర్ల జాబితాలో మృతులు, డబుల్ ఎంట్రీలు, స్థానికంగా లేని వారి ఓట్లు ఉన్నాయి. ఉరవకొండలోని 112 పోలింగు బూత్‌లో పాత ఓటరు జాబితాలో 1107 మంది ఓటర్లు ఉండేవారు. ఇంటింటా ఓటరు జాబితా పరిశీలన సమయంలో టీడీపీ నాయకులు.. ఫిర్యాదు చేశారు. అందులో 63 మంది ఓటర్లు మృతి చెందినట్లు బీఎల్ఓలకు వివరాలను అందించారు.
మృతుల ఓటరు సంఖ్యలతో పాటు తగిన వివరాలను ఇచ్చారు. వాటి తొలగింపునకు బీఎల్వోతో ఆన్‌లైన్‌లోనూ వివరాలను నమోదు చేయించారు. కానీ తాజాగా విడుదలైన జాబితాలో పదుల సంఖ్యలో మృతుల ఓట్ల దర్శనం ఇస్తున్నారు. ఉరవకొండ 131 పోలింగ్ కేంద్రంలో 23 మంది మృతి చెందిన ఓట్లు ఉన్నాయి. అయితే వారిలో 15 మందికి సంబంధించిన ఆధారాలు బీఎల్వోకి గతంలోనే ఇచ్చామని, శాశ్వతంగా ఊరిలో లేని వారివి, డబుల్, ట్రిబుల్ ఓట్లు కలిగిన వారి వివరాలను సైతం ఇచ్చి తొలగించాలని కోరామని బూత్ కన్వీనర్ వసంతబాబు తెలిపారు.
ఉరవకొండ 129 పోలింగ్ కేంద్రంలో దాదాపు 12 మంది ఓటర్లు మృతి చెందారు. ఆ వివరాలను ఆధారాలతో సహా బీఎల్వో దృష్టికి తీసుకెళ్లామని, వాటిని తొలగించడానికి ఆయన తమ ముందే ఆన్లైన్లో వివరాలను నమోదు చేశాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. అధికారులు మాత్రం వాటిని తొలగించకుండా జాబితాను ఆమోదింపజేశారని అంటున్నారు.
వజ్రకరూరులోని 68, 69 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 22 ఓట్లు మృతి చెందిన వారివి, శాశ్వతంగా గ్రామంలో లేని ఓటర్లు 13 మంది వరకు ఉన్నారు. వారి పేర్లు తొలగించాలని కూడా ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకెళ్లినా.. ఓటర్ల జాబితాలో వారి వివరాలు తొలగించకుండా అలాగే ఉంచారని మండిపడుతున్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ఇలాంటివి చాలా ఉన్నాయని.. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని బూత్ కన్వీనర్లు కోరుతున్నారు.
ఆ మాజీ మంత్రికి మూడు చోట్లు ఓటు హక్కు! తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాతో వెలుగులోకి
మూడు ఇంటి నెంబర్లతో 150కి పైగా ఓట్లు: ఉరవకొండ 131వ పోలింగ్ బూత్‌లో మూడు ఇంటి నెంబర్లతో 150కి పైగా ఓట్లు (Multiple Votes with Same House Number) ఉన్నాయి. గతంలో ఈ మూడు నెంబర్లతో 278 ఓట్లు ఉండగా.. తెలుగుదేశం నాయకులు బీఎల్వోలకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పొరపాటును కొంతమేర సరిదిద్దారు. ఇటీవల విడుదలైన ముసాయిదా జాబితాను పరిశీలిస్తే 150 మందికి పైగా ఓటర్ల వివరాలు మాత్రం ఆ మూడు ఇంటి నెంబర్లతోనే ఉంచారు. అదే విధంగా పలు ఓట్లు 0 ఇంటి నెంబర్‌తో ఉన్నాయి. ఈ గందరగోళాన్ని సరిచేయాలని ఓటర్లు, తెలుగుదేశం నాయకులు కోరుతున్నారు.
మొక్కుబడిగా ఓటరు జాబితా సవరణ - భారీగా అవకతవకలు, బీఎల్వోల తీరుపై ఓటర్ల అసహనం