మహిళల సాధికారతే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురంలో మహిళా సంఘాలతో కలసి వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో మంత్రితో పాటు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. కేక్ కట్ చేశారు. జిల్లాలో 59 వేల సంఘాల సభ్యులకు రూ.450.24 కోట్ల రుణమాఫీ చేశామన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. వైఎస్సార్ ఆసరాతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించామన్నారు. కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆసరాతో మహిళల్లో ఆనందం నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ నిత్యం కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.