ఇచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తున్నారని మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. అనంతపురంలో రేషన్ సరుకులను ఇంటింటికి సరఫరా చేసే ప్రత్యేక వాహనాలను ఆయన ప్రారంభించారు. జిల్లాపాలనాధికారి గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటివద్దకే రేషన్ ఇచ్చే వ్యవస్థను తొలిసారిగా సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 754 వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని వివరించారు.
రాయితీపై వాహనాలు..
గ్రామాల్లోని నిరుద్యోగులకు 60శాతం రాయితీతో వాహనాలను అందించామన్నారు. డ్రైవర్‌కు ప్రతినెలా రూ.పదివేల వేతనంతోపాటు, సహాయకుడికి రూ.మూడు వేలు, ఇంధనం కోసం మరో రూ.మూడు వేలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలెంటీర్ల ద్వారా పీడీఎస్ వ్యవస్థలో సరకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు... పట్టా ఇచ్చి సరిపెట్టేశారు'