అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రభుత్వ ప్రణాళికను స్పష్టం చేశారు. జిల్లాలో ఏటా మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం ప్రైవేట్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రైతులకు రాయితీతో ఇస్తున్న వ్యవస్థ... ఇకపై ఉండదని చెెప్పారు. వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచే విత్తనాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే విత్తన శుద్ధి కేంద్రాలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అధికారులపై ఆగ్రహం
వివిధ పంటల సాగు వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయని వైనంపై మంత్రి కన్నబాబు జేడీఏను ప్రశ్నించారు. ప్రభుత్వం పంటల నమోదుకు ఈ-కర్షక్ కార్యక్రమం నిర్వహిస్తుండగా... వ్యవసాయ అధికారులు సరిగా నిర్వహించక పోవటం బాధాకరమన్నారు. ఈ- కర్షక్ ఆధారంగానే పంటల బీమా, ఇన్ పుట్ రాయితీ, పంట దిగుబడుల కోనుగోలు చేసే ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పంట నమోదు చేయకపోతే రైతులు నష్టపోతారని అధికారులకు హితవు పలికారు.
రైన్ గన్లు వెనక్కు
రైన్ గన్లను గత ప్రభుత్వం 116 కోట్ల రూపాయలు ఖర్చుచేసి తెప్పిస్తే, వాటిని రైతుల నుంచి ఎందుకు వెనక్కు తీసుకోలేదని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. చాలా మంది రైతుల ఇళ్లలో పెద్ద ఎత్తున పైపులు, రైన్ గన్నులు ఉన్నాయని స్వయంగా ఫిర్యాదు చేసినా... వ్యవసాయ అధికారులు పట్టించుకోవటంలేదని ఎమ్మెల్యేలు మంత్రికి చెప్పారు. రైను గన్నులన్నీ వెనక్కు తెప్పించే బాధ్యత మండల వ్యవసాయ అధికారులదేనని, జేడీఏ తగిన చర్యలు తీసుకోవాలని కన్నబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండీ... ఇద్దరు మంత్రుల పోర్టుఫోలియోలో మార్పులు