తల్లిదండ్రులు ఉన్నా.. లేరని చెప్పి పిల్లలతో వ్యాపారాలు చేయిస్తే సహించేది లేదని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే అన్నారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనాథ పిల్లల పేరుతో ఆశ్రమాలు పెట్టి అవకతవకలకు పాల్పడితే..ఎంతటి వారినైనా శిక్షించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. జిల్లాలో బాలబాలికలు ఆశ్రయం పొందుతున్న గృహాలను తనిఖీ చేశారు.
దేశవ్యాప్తంగా తమ పరిధిలో 7,400 పైచిలుకు ఆశ్రయ గృహాలు ఉన్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటన్నింటిలోనూ సోషల్ ఆడిట్ చేయించామన్నారు. జిల్లాలోని 43 ఆశ్రయాల్లో.. పదింటిని రిజిస్ట్రేషన్ లేనివిగా గుర్తించి, రద్దు చేశామన్నారు. కొన్ని ప్రదేశాల్లో చిన్నారులను నానారకాలుగా హింసిస్తూ.. రకరకాల వ్యాపారాలకు పంపించి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బాలబాలికల రక్షణలో రాష్ట్రంలో చాలా జిల్లాలకు ఆదర్శంగా అనంతపురం ఉందన్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకి ప్రత్యేక స్థానం కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్