రాష్ట్రంలో ప్రకాశం జిల్లా తర్వాత అత్యధికంగా బత్తాయి పండించేది అనంతపురం జిల్లాలోనే. సేద్య పరికరాలకు పెద్దఎత్తున రాయితీ ఇవ్వటంతోపాటు.. మొక్కలకు రాయితీలిచ్చి ఉద్యానపంటలను ప్రోత్సహించడంతో అనంతపురం జిల్లాలో 53 వేల హెక్టార్లలో బత్తాయి సాగు చేస్తున్నారు. దీనిలో కొత్తగా నాటిన, దిగుబడికి సిద్ధం లేని తోటలు 10 వేల హెక్టార్లు కాగా.. 43 వేల హెక్టార్లలో ఏటా 7 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. జిల్లా రైతులు ఏటా 3 వేల కోట్ల రూపాయల విలువైన బత్తాయి విక్రయిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ పంటను.. కేంద్ర ప్రభుత్వం ఈ-నామ్ జాబితాలో చేర్చింది. రోజూ ఉదయం ఈ-వేలం వేసి, దేశవ్యాప్తంగా యూనిఫైడ్ మార్కెట్ల నుంచి వ్యాపారులు ఈ-వేలంలో పాల్గొనేలా చేయాలి. ఇవేమీ జరగకుండానే అధికారులు ధరలు నిర్ణయించేయడం.. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు చేతులు కలపడంతో రైతులకు తగిన ధర లభించడం లేదు. మార్కెట్‌కు వెళ్లినా, పొలం వద్దే పంట అమ్మినా.. నష్టమే మిగులుతోందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ
కరోనా భయంతో పొలం వద్దే పంట అమ్మేస్తున్న రైతులను.. వ్యాపారులు నిండా ముంచుతున్నారు. టన్నుకు రెండు క్వింటాళ్ల తరుగు, హమాలీ కూలీలు, ఇలా అనేక రూపాల్లో రైతుల నుంచి దోచుకుంటున్నారు. తోటల వద్ద కొంటే 10 శాతం కమీషన్ ఉండదని చెబుతున్న వ్యాపారులు, దళారులు.. అంతకు రెట్టింపుగా దండుకుని మోసం చేస్తున్నారు. అనంతపురం మార్కెట్‌కు తెచ్చిన బత్తాయికి కమీషన్ తీసుకోవట్లేదని వ్యాపారులు చెబుతున్నప్పటికీ.. టన్నుకు 50 కిలోల చొప్పున తరుగు తీసేస్తున్నారు. కడప జిల్లా పులివెందుల సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల నుంచి పంట కొంటున్న వ్యాపారులు.. అనంతపురం మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తున్నారు. అనంత మార్కెట్‌కు రోజూ 300 టన్నులకు పైగా బత్తాయి వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో టన్ను ధర 60 నుంచి 70 వేల రూపాయలు దాకా పలకగా.. ఈ ఏడాది టన్ను ధర 42 వేలు మాత్రమే పలుకుతోంది. కళ్ల ముందే దోపిడీ జరుగుతున్నా.. వ్యాపారులు, అధికారులకు భయపడి రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. అనంతపురం బత్తాయి మార్కెట్‌లో ఈ-నామ్ విధానం కఠినంగా అమలయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: