అనంతపురంలో సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ తప్పుకోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు రూ.40 కోట్ల బకాయి రాకపోవడం వల్లే తప్పుకొంటున్నట్లు సంస్థ చెబుతున్నా, దీనికి వెనుక చాలా తతంగం నడిచినట్లు తెలుస్తోంది. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు ఎల్‌అండ్‌టీ సంస్థను తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఓ ఎమ్మెల్యే నీటి సరఫరా పథకంపై పలుమార్లు రాష్ట్ర ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. జిల్లా సమావేశాల్లోనూ సంస్థపై ఆరోపణలు చేసేవారని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
కారణం అదేనా..?
ఏళ్ల తరబడి సత్యసాయి పథకం నిర్వహణను ఎల్‌అండ్‌టీ సంస్థకు కట్టబెట్టడం పలువురు ప్రజాప్రతినిధులకు ఇష్టం లేదని తెలిసింది. జిల్లాలో 63 సీపీడబ్ల్యూఎస్ పథకాలు ఉండగా, సత్యసాయి పథకానికి తప్ప మిగతా వాటికి ఏడాదికోసారి టెండర్లు ఆహ్వానించి కొత్త గుత్తేదార్లను ఎంపిక చేస్తున్నారు. అయితే 27 ఏళ్లుగా సత్యసాయి నీటి పథక నిర్వహణ ఎల్‌అండ్‌టీకి ఎలాంటి టెండరు లేకుండా అప్పగిస్తున్నారు. సదరు సంస్థకు అంతర్జాతీయంగా మంచి పేరు ఉండటంతో అన్ని ప్రభుత్వాలు సహకరించాయి. అయితే సంస్థ తరపున పనిచేసే కొందరు వ్యక్తుల వల్ల పథక నిర్వహణ గాడి తప్పిందని ఆరోపణలు ఉన్నాయి. సత్యసాయి బోర్డుపై సంస్థ ప్రతినిధుల జోక్యం మితిమీరి ఉండేదని, అధికారులను లెక్కచేసేవారు కాదని విమర్శ ఉంది. ఈక్రమంలో ప్రభుత్వం మారగానే ఎల్‌అండ్‌టీని తప్పించాలని ఓ ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమ వారికి కాంట్రాక్టు ఇప్పించుకోవడానికి సదరు ఎమ్మెల్యే తెరవెనుక పావులు కదుపుతున్నారని తెలిసింది. ఎల్‌అండ్‌టీ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రానీస అధికారుల వత్తాసు
పథక నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకొన్నా.. నడిపే సామర్థ్యం బోర్డుకు ఉంది. ఇదే విషయంపై బోర్డులో విధులు నిర్వహించే అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖ రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఇప్పటికే పథకంలో పనిచేసే కార్మికులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపగలమని బోర్డు అధికారులు మొత్తుకుంటున్నా, గ్రానీస అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. గతంలో బోర్డులో పనిచేసిన ఓ అధికారి, గ్రానీస ఉన్నతాధికారితో కలిసి వేరొకరికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నట్లు సమాచారం. వీరి వెనుక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.
మెట్టుదిగని ఎల్‌అండ్‌టీ
పథక నిర్వహణ నుంచి తాము తప్పుకొంటున్నట్లు గత నెల 30న ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చారు. ఉన్నఫలంగా తప్పుకోవడం వల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి, బోర్డు అధికారులు మరో నెలపాటు కొనసాగాలని ఎల్‌అండ్‌టీకి ఇటీవల లేఖ రాశారు. ఈఎన్‌సీ, సీఈ స్థాయి అధికారులు సైతం చర్చలు జరిపినా ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ససేమిరా అన్నారని తెలిసింది. జిల్లా కలెక్టరు ద్వారా మరోసారి ఎల్‌అండ్‌టీతో చర్చలు జరిపే అవకాశం ఉందని బోర్డు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి..
DRONES: శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్ల సంచారం.. ఆందోళనలో స్థానికులు