ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం భూములు ఇవ్వాలని శ్రీకారం చుట్టింది. అయితే కొన్ని చోట్ల నివాసయోగ్యం కాని స్థలాలు పంపిణీలో దర్శనమిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇలాంటి వాటికి తావులేకుండా.. అందరికీ ఆమోదయోగ్యమైన.. అనుకూలమైన భూములనే ఇవ్వాలని నిరుపేదలు కోరుతున్నారు.
కష్టంతో కూడిన పని..
భూమిని ఎంపిక చేసి, చదును చేసి.. కనీస మౌలిక వసతులు కల్పించి, లేఅవుట్లు వేయించే బాధ్యతను స్థానిక తహసీల్దార్లకు అప్పగించారు. వీరిలో కొందరు.. నివాసయోగ్యం కాని భూములను ఎంపిక చేశారు. అప్పటికే ఉన్న రాళ్లపై కొంత మట్టి పోసి, చదును చేయించారు. కొన్నిచోట్ల శ్మశానాల పక్కన స్థలాలు ఎంపిక చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొండవాలు స్థలాన్ని చదును చేసి లేఅవుట్లు వేశారు. ఇలాంటివన్నీ ముంపు ప్రాంతాలే. చిన్న వర్షం కురిసినా ఇళ్లలోకి నీరు చేరే వీలుంది. కొన్నిచోట్ల ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఎంపిక చేశారు. అక్కడ విద్యుత్తు, మురుగు పారుదల వ్యవస్థ, తాగునీరు, అంతర్గత దారులు, అనుసంధాన దారులు.. ఇలా ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కావడం గమనార్హం.
సమస్య ఇక్కడే...
విడపనకల్లు, ముదిగుబ్బ, బ్రహ్మసముద్రం, సోమందేపల్లి, ఉరవకొండ, రాయదుర్గం, రాప్తాడు మండలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎంపిక చేసిన స్థలాలు ఇదే రీతిన ఉన్నాయి. ఇక్కడ ఎంపిక చేసిన స్థలాల్లో ప్లాట్ల పనులు జరుగుతున్నా.. మున్ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
చక్కదిద్దితేనే వెలుగులు
పేదవారికి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణం మరింత కష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టాల పంపిణీకి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. జిల్లాలో అభ్యంతరకరంగా లేఅవుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఉన్నతాధికారులు గుర్తించి అవసరమైన కనీస మార్పులు, చేర్పులు చేయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. క్షేత్రస్థాయి అధికారులను ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుంది. లబ్ధిదారులు కూడా హర్షిస్తారు.
తలచుకుంటే కలవరమే..
![land issue problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7840352_188_7840352_1593566408732.png)
ఈ చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్.. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల అవతల 258 సర్వే నెంబర్‌లోనిది. దామాజీపల్లి, ఎర్రంపల్లి, చిన్నపల్లి, చెన్నేకొత్తపల్లి, ఎన్.ఎస్.గేట్ గ్రామాలకు చెందిన 350 మంది లబ్ధిదారులకు ఇక్కడే పట్టాలు ఇవ్వనున్నారు. చిన్నపాటి వర్షానికే అంతర్గత రోడ్లు దెబ్బతిన్నాయి. పక్కనే కొండ ప్రాంతం ఉంది. అక్కడ ఏమాత్రం వర్షం కురిసినా.. ఆ నీళ్లు నేరుగా ఇక్కడికే వస్తాయి. ఈ ఫ్లాట్లన్నీ ముంపు ప్రాంతంలో ఉన్నాయి.
చినుకు పడితే చింతే..
![land issue problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7840352_819_7840352_1593566426194.png)
ఈ చిత్రంలో చెరువును తలపిస్తోంది.. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామ లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధం చేసిన స్థలం. 217 సర్వే నెంబర్‌లో దాదాపు 50 మందికి ఇవ్వడానికి ప్లాట్లు వేశారు. అయితే ఇది లోతట్టు ప్రాంతం. చుట్టూ పొలాలు ఉన్నాయి. వర్షం కురిస్తే ఆ నీరు కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది. ఈ ప్రాంతంలో లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయిస్తే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
కిందరాళ్లు.. పైన ప్లాట్లు
గాండ్లపెంటకు సమీపంలోని స్థలంలో అంతా గతంలో రాళ్లు, రప్పలతో నిండి ఉండేది. రాళ్లను తొలగించకుండా వాటిపై మట్టి వేసి లే అవుట్లు సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టడం అతి కష్టం. ఇక్కడ మొత్తం 143 మందికి పట్టాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.
కల్లం.. ఇళ్ల స్థలం!
యాడికి మండలం కేశవరాయునిపేట వద్ద చెక్‌డ్యామ్ కట్టిన చోట 2014లో అప్పటి నాయకులు అనాలోచితంగా రూ.1.10లక్షలతో పంట నూర్పిడి కల్లాన్ని నిర్మించారు. ప్రస్తుతం కొందరు నాయకులు అదే స్థానంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తలచి కల్లాన్ని తొలగించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ గ్రామంలో అయిదుగురిని మాత్రమే ఇళ్ల స్థలాలకు అర్హులుగా ఎంపిక చేశారు. వారి కోసం ఇక్కడి చెక్‌డ్యామ్‌కు సమీపంలో మరో చోట స్థలముందని సూచించినా కల్లాన్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారో తమకు తెలియదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
ఎంత ఖర్చయినా చక్కదిద్దుతాం
దాదాపు 90 శాతం లే అవుట్లలో అన్ని పనులు పూర్తయ్యాయి. రెండో విడతకు సంబంధించిన లే అవుట్లలో కొన్ని పనులు జరుగుతున్నాయి. కూలీల సంఖ్యను పెంచి చదును పనులు వేగవంతం చేస్తున్నాం. కొలతలు వేయడానికి పొరుగు మండలాల నుంచి సర్వేయర్లు, ఇతర అధికారులను పంపిస్తాం. అనుకున్న సమయం కంటే ముందే వంద శాతం పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం. ఎంత ఖర్చయినా.. మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడా రాజీ పడేది లేదు.- గంధం చంద్రుడు, కలెక్టర్
ఇదీ చదవండి; కొత్త 108, 104 వాహనాలను ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్