అనంతపురం జిల్లా కణేకల్లు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో కురుబ కామాక్షమ్మ అనే మహిళ నివసిస్తోంది. కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్న ఈమెకు, విద్యుత్ అధికారులు కరెంటు బిల్లు రూపంలో షాకిచ్చారు. డిసెంబరు నెలకు ఏకంగా రూ.1,49,034 విద్యుత్ బిల్లు వచ్చింది. ప్రతి నెలా వంద దాటని బిల్లు లక్ష దాటటంతో కామాక్షమ్మ ఖంగుతింది.
తనకు ప్రతి నెలా విద్యుత్ బిల్లు వంద దాటదని.. ఆమె ఇంట్లో కేవలం మూడు విద్యుత్ బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నాయని ఆవేదన చెందింది. తాను జీవితాంతం విద్యుత్ వినియోగించినా ఇంత విద్యుత్ బిల్లు రాదని విచారం వ్యక్తం చేస్తోంది. కూలీ పనులు చేసుకుని జీవించే ఆమె.. బిల్లు ఎలా చెల్లించాలో తెలియక విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఈ విషయంపై స్థానిక విద్యుత్ అధికారులను అడగగా.. సాంకేతిక సమస్య కారణంగానే ఇలాంటి తప్పు జరిగిందన్నారు. కామాక్షమ్మ ఫిర్యాదు మేరకు పై అధికారులతో మాట్లాడి.. ఆమె వినియోగించిన యూనిట్ల మేరకే విద్యుత్ బిల్లు వచ్చేలా చూస్తామన్నారు.
ఇదీ చదవండి: మూడు రోజుల పాటు అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ