వైకాపా ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల అంశం ప్రజల్లో అపహాస్యమవుతోందని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను అనే జగన్... అమరావతి విషయంలో చేసింది ఏంటని నిలదీశారు. ఏడాదిన్నర పాలనలో రాయలసీమకు, రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యమని విమర్శించారు. ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అని జగన్ చెప్పలేదా అని ప్రశ్నించారు.
రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్క నెలలో 4 రకాలుగా మాట్లాడారన్న కాలవ... నెల రోజుల్లో ఇన్ని మాటలు మార్చిన మంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు రాయలసీమకు తాగు, సాగు నీరు ఇవ్వడంతో పాటు అనేక పరిశ్రమలు తెచ్చారని గుర్తుచేశారు. వెనకబడిన అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తెచ్చిన ఘనత తెదేపాదేనని తేల్చిచెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దింది, గండికోట నిర్వాసితులకు పరిహారం ఇచ్చింది చంద్రబాబేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత!