జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురంలో హత్యకు గురైన తెదేపా కార్యకర్త గొల్ల గోపాల్ మృతదేహానికి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో ఆయన నివాళులర్పించారు. మృతుడు గోపాల్ కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు.
నిందితుడు గొల్ల శ్రీనివాసులు అధికారంలో ఉన్నామన్న అహంకారంతో గోపాల్‌ను దారుణంగా హతమార్చాడని కాలవ మండిపడ్డారు. ప్రశాంత రాయదుర్గం నియోజకవర్గంలో నేర స్వభావం కలిగిన వారిని ప్రోత్సహిస్తూ.. హత్యరాజకీయాలకు తెరలేపారని ఆక్షేపించారు. ఏం చేసినా అడ్డూ అదుపు ఉండదన్న అహంకారంతో హత్యాకాండను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్తను పొట్టనపెట్టుకున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోపాల్ కుటుంబానికి తెదేపా పార్టీ అండగా ఉంటుందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి: పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం