అనంతపురం జిల్లా కదిరికి చెందిన కె.చిన్నబాబయ్య 1996లో ఏపీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కదిరి హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ నుంచి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి రూ.75 వేల రుణం తీసుకున్నారు. అందులోనూ ఓ ఉద్యోగి కమీషన్ కింద రూ.25వేలు మినహాయించుకుని రూ.50 వేలే ఇచ్చారు. అయినా చిన్నబాబయ్య వాయిదాల పద్ధతిలో మొత్తం చెల్లించారు. వడ్డీ పెరిగిందని, మొత్తం బకాయి రూ.1.25 లక్షలు చెల్లించాలని, లేదంటే ఇంటిని వేలం వేస్తామని నోటీసు ఇచ్చారు. దీంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి, డీడీ రూపంలో రూ.1.25 లక్షలు చెల్లించారు. అయితే... రూ.5,25,685 చెల్లించి పత్రాలు తీసుకెళ్లాలని 2016లో మరోసారి నోటీసు రావడంతో ఆ రైతు కుంగిపోయారు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తూ 71 ఏళ్ల వయసులో కూలి పని కూడా చేయలేనని, వృద్ధురాలైన భార్య చిన్నచిన్న పనులు చేస్తూ తనను పోషిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి విచారణ చేపట్టగా రైతు చెల్లించిన సొమ్మును రుణ ఖాతాలో జమ చేయకుండా ప్రత్యేక ఖాతాలో ఉద్యోగులు ఉంచారని తేలింది. ఉద్యోగుల బాధ్యతారాహిత్యానికి పేద వ్యక్తిని వేధించడం సరికాదంటూ వారిపై తగిన చర్యలు తీసుకుని పత్రాలు తిరిగి ఇవ్వాలని ఏపీ హౌసింగ్ ఫెడరేషన్ ఎండీకి ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చూడండి: శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తూపాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు..