వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మారుస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారన్న దానిపై జూన్ 13వ తేదీన హైదరాబాద్‌లో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కడప జైలుకు తరలించారు.
ఈ కేసులో పలుమార్లు ప్రభాకర్ రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. అయితే బుధవారం అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు బైయిల్ పిటిషన్‌పై ఆన్లైన్లో విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం... అనంతపురంలో నమోదైన మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు కడప జైలులో ఉన్న వాటన్నింటికీ బెయిల్ మంజూరైనట్లు జేసీ తరుఫున న్యాయవాది రవికుమార్ రెడ్డి తెలిపారు. పూచీకత్తు సమర్పించిన అనంతరం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే తాడిపత్రిలో నమోదైన మరో రెండు కేసుల్లో పోలీసులు ఇంకా కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయలేదు. దీనిపై పోలీసులు ఎలా ముందుకెళ్తారన్నది స్పష్టత రాలేదు.
ఇదీ చదవండి