Joint Conference of Public Societies : హత్యా రాజకీయాలు, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని నీటిపారుదల రంగ నిపుణులు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎగువ భద్ర నదిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి.
కర్ణాటక రాష్ట్రంలో భద్ర ప్రాజెక్టును శరవేగంతో నిర్మిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడటం లేదని లక్ష్మీనారాయణ ఆరోపించారు. గతంలో ఫ్యాక్షనిజంతో నష్టపోయిన రాయలసీమ జిల్లా ప్రజలు.. ప్రస్తుతం హత్యారాజకీయాలు, అవినీతిలో కూరుకుపోయిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వల్లనే మరోసారి నష్టపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే భద్ర ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు తీసుకుంటుండగా, ఎత్తిపోతల ద్వారా మరో 30 టీఎంసీలు తీసుకునే ప్రతిపాదనకు కేంద్రమే ఆర్థిక సహాయం చేయటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం భద్రను జాతీయ ప్రాజక్టుగా ప్రకటించి 5300 కోట్ల రూపాయలు తొలి విడతగా బడ్జెట్లో కేటాయించినా సీఎం జగన్ మోహన్ రెడ్డి నోరు మెదపటం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నాడని ధ్వజమెత్తారు. ఈనెల 13న అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి భద్ర ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ చెప్పారు.
అవినీతి, హత్యారాజకీయాల్లో కూరుకుపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది. కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోంది. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. - లక్ష్మీనారాయణ, నీటిపారుదల రంగ నిపుణులు
తుంగభద్ర ప్రాజెక్టు ఎగువన ఎత్తిపోతల నిర్మించి 29.5 టీఎంసీలు తరలించాలన్నది కర్నాటక ప్రభుత్వం ఆలోచన. ఇందుకు కేంద్రం, సీడబ్ల్యూసీ ఆమోదించడమేగాక.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి బడ్జెట్ లో 5300కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ శాశ్వత ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రశ్నించకపోతే రాయలసీమ ద్రోహిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. - తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
కర్నాటక రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఎగువ భద్ర పూర్తయితే భవిష్యత్ లో రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 13న తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించడంతో పాటు.. అధికారులను కలిసి విన్నవిస్తాం. రైతులు, ప్రజలను కలుపుకొని ఉద్యమాలకు సిద్ధం చేస్తాం. - జగదీష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
ఇవీ చదవండి :