2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరఫున హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓడిపోయారు. వైకాపాలో క్రియాశీలకంగా పని చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల చివరి క్షణంలో పార్టీ అధ్యక్షుడు జగన్ హిందూపురం అభ్యర్థిగా మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ ను బరిలోకి దించడం వల్ల నవీన్ నిశ్చల్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండసాగారు. ఎన్నికల అనంతరం ఓటమిపాలైన మహమ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి, నవీన్ నిశ్చల్‌ను హిందూపురం పార్లమెంట్ వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు.
అయినా మహమ్మద్ ఇక్బాల్ ఓవైపు, నవీన్ నిశ్చల్ మరోవైపు హిందూపురంలో అడుగులు వేస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తన ఇంటిలోనే పార్టీ కార్యకలాపాలను చేపడుతూ కార్యకర్తలను కలుస్తూ వచ్చారు. నవీన్ నిశ్చల్ మరో వర్గం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నవీన్ నిశ్చల్ తన వర్గంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరికి ఇష్టం వచ్చిన వారు.. కావాల్సిన వాళ్ల దగ్గరకు వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేస్తామని నవీన్ అన్నారు.
ఇదీ చదవండి: దేశంలో అత్యల్ప స్థాయికి కొవిడ్ మరణాల రేటు