ETV Bharat / state

బీఆర్​ఎస్​లో అంతర్గత పోరు.. మంత్రులు Vs ఎమ్మెల్యేలు - BRS Latest News

Internal disputes in BRS: తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత వివాదాలు, అసంతృప్తులు బయటపడుతున్నాయి. నామినేటెడ్‌ పదవులు, నిధుల కేటాయింపు, పోలీసు పోస్టింగ్‌లు, ప్రొటోకాల్‌ వంటి అంశాలు అమాత్యులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలు.. ఆ జిల్లా మంత్రి మల్లారెడ్డిపై గళమెత్తడం పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.

Internal disputes in BRS
Internal disputes in BRS
author img

By

Published : Dec 20, 2022, 11:18 AM IST

Internal disputes in BRS:తెలంగాణలోని పలు జిల్లాల్లో నేతల అంతర్గత విభేదాలు బీఆర్​ఎస్​కు తలనొప్పిగా మారాయి. నామినేటెడ్ పదవులు సహా ఇతర అంశాలు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్​ఎస్​లో ముసలం పుట్టించాయి. మంత్రి మల్లారెడ్డిపై జిల్లా శాసనసభ్యులు తమ అసంతృప్తి బాహాటంగానే ప్రకటించారు. జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రి వైఖరి, తమకు, తమ నియోజకవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై సుధీర్ఘంగా చర్చించారు. దూలపల్లిలోని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసం భేటీకి వేదికైంది.

మైనంపల్లితోపాటు ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు సుభాష్ రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి నియామకంపై వివాదం రాజుకొంది. కారణాలేవైనా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలా ఎమ్మెల్యేలు.. సామూహికంగా ఓ మంత్రిపై అసమ్మతిని వ్యక్తం చేయడం ఇదే ప్రథమం. జాతీయ పార్టీగా బీఆర్​ఎస్​ అవతరించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రోటోకాల్​ వివాదాలు: వాస్తవానికి ఇలాంటి పరిస్థితి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య పార్టీ ఆశించిన స్థాయిలో సఖ్యత లేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కొన్నిచోట్ల అసంతృప్తిని వెళ్లగక్కుతున్న ఉదంతాలున్నాయి. పలు సందర్భాల్లో ప్రొటోకాల్‌పరమైన సమస్యలూ నేతల మధ్య పొరపొచ్చాలకు కారణమవుతున్నాయి. ఉదాహరణకు సెప్టెంబరులో పాలేరు రిజర్వాయర్‌ వద్ద చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ప్లెక్సీల వ్యవహారం స్థానిక నాయకుల మధ్య కలహాలను బయటపెట్టింది. పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం నేతల సిఫార్సులను పరిగణనలోనికి తీసుకుంటోంది.

అయితే పోలీసు కమిషనర్లు, ఎస్పీల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఖమ్మం జిల్లాలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పదవిని అధిష్ఠానం ఓ ఎమ్మెల్యే సన్నిహితునికి ఇవ్వగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇతర నేతలు అసంతృప్తితో ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకాలేదు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేని కారణంగా నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సహా ఆ జిల్లాలోని ఇతర నియామకాల విషయంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మధ్య తరచూ భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహబూబాబాద్​లో పరిస్థితి: డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మంత్రిని ఖాతరుచేయడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత కూడా కొన్ని అంశాల్లో మంత్రిపై అంతర్గతంగా విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రి సబితారెడ్డికి దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆమెపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రుల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు అధికంగా ఉండటం, అభివృద్ధి పనులు భారీగా జరగడంపై స్థానిక ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాలో పరిస్థితి ఇది: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నింటా మంత్రి జగదీశ్‌రెడ్డి మాటే చెల్లుబాటు కావడంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యేగా భగత్‌ గెలిచిన తర్వాత అక్కడ మంత్రి సన్నిహితుడు కోటిరెడ్డి ఎమ్మెల్సీగా నియమితుడు కావడం విభేదాలకు దారితీసింది. మునుగోడు ఉప ఎన్నికలో జగదీశ్‌రెడ్డి సూచించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ముందుగా కొందరు ఎమ్మెల్యేలు మద్దతునివ్వలేదు. అధిష్ఠానం జోక్యం తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. కరీంనగర్‌ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌కు, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌కు మధ్య విభేదాలున్నాయి.

ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడంలో భాగంగానే అధిష్ఠానం ఇటీవల రవీందర్‌సింగ్‌ను ఆ మంత్రిశాఖ పరిధిలోని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ పదవి కేటాయించింది. హైదరాబాద్‌ జిల్లాలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీలు ఏర్పాటు చేస్తున్న పార్టీ, ప్రభుత్వ సమావేశాలకు కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడం ఐక్యత లోపాన్ని చాటుతోంది. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదు. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జగడం ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌, కల్వకుర్తి, తాండూరు నియోజకవర్గాల్లో ఇటీవల అలాంటివి బయటపడ్డాయి.

నేతలపై అధిష్ఠానం దృష్టి: మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తూ పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని, పెద్దన్న పాత్ర నిర్వహించాలని మంత్రులకు నిర్దేశిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్‌ రెండు దఫాలు సమావేశమై విభేదాలను నివారించే యత్నం చేశారు. అయినా కొన్ని ప్రాంతాల్లో అవి సమసిపోకపోవడం అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంపై అధిష్ఠానం ఆరా తీసింది.

సమావేశంలో చర్చించిన అంశాలు, వారు మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలను విశ్లేషించింది. వాస్తవంగా మైనంపల్లి ఇంట్లో విందుకే వారంతా హాజరయ్యారని, తర్వాత మల్కాజిగిరి ఎంపీ స్థానానికి బీఆర్​ఎస్​ అభ్యర్థిత్వం కోసం మద్దతు సమీకరించే క్రమంలో మైనంపల్లి సమావేశం నిర్వహించారని అధిష్ఠానం తెలుసుకుంది. ఈ భేటీకి మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి కూడా కారణమనే అంచనాకు వచ్చింది. ఈ పరిణామాలపై చర్చించేందుకు త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.