అనంతపురం జిల్లాలో 70 శాతం గ్రామాలు.. 30 లక్షల జనాభాకు ఐదు రోజులుగా తాగునీటి కటకట ఏర్పడింది. గుత్తేదారు సంస్థలు 5 నెలలుగా జీతాలు, 20 నెలలుగా పీఎఫ్ చెల్లించకపోవడంతో వెయ్యి మందికిపైగా కార్మికుల జులై 10 నుంచి సమ్మె చేస్తున్నారు. శ్రీరామిరెడ్డి, సత్యసాయి పథకాల్లో పనిచేసే సిబ్బంది పెన్నహోబిలం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలోని పంపుహౌస్‌ల్లో మోటార్లు నిలిపేసి, నిరసన తెలుపుతున్నారు.
శ్రీరామిరెడ్డి పథకం పరిధిలో కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లోని 1,025 గ్రామాలు, సత్యసాయి పథకం కింద ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోని 600 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. సుమారు 1,600 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. సమ్మె విరమింపజేసేందుకు కార్మికులతో జిల్లా కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెండింగ్ జీతాల మంజూరుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు.
ఇదీ చదవండి: CM JAGAN TOUR: అనంతపురం జిల్లా రాయదుర్గం చేరుకున్న సీఎం జగన్