అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విషాదం జరిగింది. భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన జిలాన్బాషా, షమీమ్ భార్యాభర్తలు. వీరు స్థానిక టైలర్స్ కాలనీలో నివాసముంటున్నారు. జిలాన్బాషా కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. భార్య షమీమ్ పట్టణ సమీపంలోని దాల్మిల్ కర్మాగారంలో పనిచేస్తోంది. వీరికి కుమారుడు మహబూబ్బాషా, కుమార్తె పర్వీన్ ఉన్నారు.
షమీమ్ సోమవారం కర్మాగారంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు చీర యంత్రంలో చిక్కుకుని అందులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు ఆమెను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది. భర్త జిలాన్బాషా ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. అనంతరం గుండెలో నొప్పిగా ఉందంటూ అక్కడే కుప్పకూలిపోయాడు. జిలాన్బాషాను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఒకేసారి తల్లిదండ్రులు దూరం కావటంతో చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలారు.
ఇదీ చూడండి: