అనంతపురం జిల్లా మడకశిర మండలం హరేసముద్రం రైతు అశ్వత్థ నారాయణ.. ఉద్యాన పంటల సాగులో సత్తా చాటాడు. తమకున్న 10 ఎకరాల్లో రెండు బోర్లు వేసి.. గతంలో రాగి, మొక్కజొన్న పంటను పండించే వాళ్లమని ఆయన తెలిపాడు. ఇంత చేసినా దిగుబడులు ఆశాజనకంగా రాలేదని చెప్పాడు. ఉద్యాన అధికారులు, అనుభవజ్ఞులైన రైతుల సలహాలతో ఉద్యాన పంటలవైపు మొగ్గు చూపినట్లు వెల్లడించాడు. మొదట రూ. 3 లక్షల పెట్టుబడితో 3 ఎకరాల్లో.. ఆవుపేడ, కోళ్ల ఎరువుతో సేంద్రీయ పద్ధతిలో పుచ్చకాయ సాగు చేశామన్నాడు. రెండు నెలలకే అధిక దిగుబడి రాగా.. పొలం వద్దకే వచ్చి వ్యాపారస్థులు కొనుగోలు చేసినట్లు వివరించాడు. పెట్టుబడి పోను రూ. లక్షకు పైగా ఆదాయం సమకూరిందని హర్షం వ్యక్తం చేశాడు.
పుచ్చకాయ స్ఫూర్తితో బొప్పాయి వైపు...
ఇదే స్ఫూర్తితో పుచ్చకాయలు తొలగించిన అనంతరం.. సేంద్రియ ఎరువులతో బొప్పాయి సాగు చేసినట్లు అశ్వత్థ నారాయణ పేర్కొన్నాడు. పక్కనున్న కర్ణాటక నుంచి మొక్కకు రూ. 17 చొప్పున రవాణాతో కలిపి రూ. 50 వేలు ఖర్చు చేసి 2500 మొక్కలు తెప్పించినట్లు చెప్పాడు. ఏడడుగుల దూరం ఉండే విధంగా మొక్కలు నాటామన్నాడు. డ్రిప్ ద్వారా సేంద్రియ ఎరువులు అందించేందుకు.. కుటుంబ సభ్యులతో పాటు రోజూ ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుష కూలీలు పని చేసేవాళ్లని వెల్లడించాడు. నాలుగు నెలలకు పూత రాగా.. కాండం దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో పూతను తొలగించామన్నాడు. ఎనిమిది నెలలకు పంట మొదటి కోతకు వచ్చినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి: మే 10 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు
పెట్టుబడి వచ్చేసింది.. మిగతావన్నీ లాభాలే:
రూ. 80 వేలతో బొప్పాయి మొదటి కోతను వ్యాపారస్థులు కొనుగోలు చేశారని రైతు పేర్కొన్నాడు. రెండో కోతలో 8 టన్నుల దిగుబడికి గాను.. కిలో రూ. 16 చొప్పున మార్కెట్లో ధర పలికిందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మూడో కోతలో 12 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా.. రూ. 18 చొప్పున విక్రయించినట్లు తెలిపాడు. ఈ మూడు కోతలతో వచ్చే ఆదాయంతో పెట్టుబడి వచ్చినట్లేనన్నాడు. అనంతరం వచ్చేదంతా లాభమేనని హర్షం వ్యక్తం చేశాడు.
ముగ్గురు కుమారుల్లో ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. వారికి తోడుగా నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. మేము పండించిన బొప్పాయి పంటలో అధిక దిగుబడి వచ్చింది. దీనికి తోడు మార్కెట్లో ధరలు పెరిగితే.. రైతులకు లాభాలు అధికంగా సమకూరుతాయి. - అశ్వత్థ నారాయణ తండ్రి హనుమప్ప
సేంద్రీయ పద్ధతిలో బొప్పాయి సాగు చేశాం. అధిక దిగుబడి సాధించాం. మూడో కోత నాటికి పెట్టిన పెట్టుబడి రానుంది. అధిక లాభాలు రావాల్సిన సమయంలో.. కరోనా వల్ల ధరలు మందగించడం కొంత నిరుత్సాహపరిచింది. - అశ్వత్థ నారాయణ తమ్ముడు చంద్రశేఖర్
ఇదీ చదవండి: