అనంతపురం జిల్లా, తనకల్లు మండలం, దిగువ చెక్కపల్లి గ్రామ సమీపంలో గుప్త నిధుల కోసం అనుమానాస్పదంగా సంచరిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో.. గుప్తనిధుల పేరుతో దేవాలయాలు పాడుబడిన భవనాల వద్ద కొంతమంది తవ్వకాలు జరుపుతున్నారని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ప్రజలు ఇలాంటి అపోహల నుంచి బయటకు రావాలని సూచించారు. ఇటీవల ఆలయాల పై జరుగుతున్న దాడులు, గుప్త నిధుల తవ్వకాలు కారణంగా జిల్లాలోని పలు దేవాలయాల్లో పోలీసు సిబ్బందిని పర్యవేక్షణగా ఉంచామని అన్నారు. ఈ తరుణంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అరెస్టు చేశామని చెప్పారు. వీరి నుంచి సెల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుప్త నిధులు, దేవాలయాలకు సంబంధించిన విలువైన వస్తువులు ప్రభుత్వానికి చెందుతాయని.. ప్రజలు తవ్వకాలు జరిపి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వివేకానంద జయంతి పురస్కరించుకుని రక్తదాన శిబిరం