అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రబీలో రైతులు చెరువులు, వేదవతి హగరి లోని పరివాహక ప్రాంతాల్లో బోరు బావుల ద్వారా వరి పంట వేస్తారు. గత 15 - 20 రోజుల నుంచి వరి ధాన్యం కోసి రైతులు కల్లాల్లో రాసులు పోసుకున్నారు. భారీ వర్షానికి వరి ధాన్యం తడిసిపోయాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో ఆశగా కల్లాల్లో ధాన్యం ఉంచిన రైతులు..
ప్రభుత్వం కనేకల్ మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించింది. జిల్లా పౌరసరఫరాల శాఖ వరి కొనుగోలు చేపట్టింది. రైతులకు వరి ధాన్యం తూకం వేయడానికి ఖాళీ సంచులు ఇవ్వకపోవడంతో.. రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచి ఎదురు చూశారు. బహిరంగ మార్కెట్లో ధాన్యం ధరలు తక్కువగా ఉండడంతో రైతులు ప్రభుత్వానికి విక్రయించేందుకు పోటీ పడుతున్నారు. కానీ రాత్రి అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి కల్లాల్లో కుప్పలుగా ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసిన కారణంగా.. రైతులు పెద్ద ఎత్తున నష్ట పోయినట్లు వాపోయారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా... రైతుల వద్ద ధాన్యం సేకరణలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని.. ఇప్పుడు తడిసిన ధాన్యం ఎలా కొనుగోలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?
ఖాళీ గోనె సంచుల కోసం రైతులు రెండు రోజులు పౌరసరఫరాల గోదాం వద్ద, ఆర్ బి కే వద్ద ఆందోళన చేశారు. భారీ వర్షానికి వరి ధాన్యం తడిసిన కారణంగా.. రైతులకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
కోల్కతాలో బ్లాక్ ఫంగస్ పంజా- మహిళ మృతి
ఈటీవీ భారత్ కథనానికి స్పందన: వరి కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు