అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్ మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనేక పంటలు నీట మునిగాయి. విడపనకల్లు మండలంలోని డోనేకల్లు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గుంతకల్లు-బళ్లారి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
పొలికి, చాబాల, ధర్మపురి గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..డోనేకల్లు గ్రామంలోని వాగులు పట్టక పొలాల్లోకి నీరు ప్రవేశించి వందల ఎకరాల్లో వేరుశెనగ, పత్తి, మిరప పంటలు నీట మునిగి కుళ్ళిపోయే స్థితికి వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి తమను అదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కంబదూరు, కుందుర్పి మండల పరిధిలో భారీ వర్షపాతం నమోదు కావటంతో ఈ ప్రాంతంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుందుర్పి మండల పరిధిలో 40.2 మిల్లీ మీటర్లు, కంబదూరు పరిధిలో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయిందని అధికారులు వెల్లడించారు.
అమ్మదూరం మండల పరిధిలోని తిమ్మాపురం ప్రాంతంలో పెద్ద వంక లోతుగా ప్రవహిస్తుండటంతో అటువైపు వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి ఆటంకంగా మారిందని రైతులు తెలిపారు. గతంలో కురిసిన వర్షాలకు ఇప్పటికే చెక్ డ్యాంలు నిండిపోగా ప్రస్తుత వర్షాలకు అధిక మోతాదులో నీరు బయటికి వస్తోంది.
ఇదీ చూడండి