Happy Sankranti to all Telugu people: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భోగి - సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా పేదలకు పండుగ కానుకలను ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికామని గుర్తు చేశారు. సంక్రాంతి కానుకతో పాటు రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకు కూడా మొత్తం కోటిన్నర కుటుంబాలకు పండుగ కానుకను ఇచ్చామన్నారు.
ఏడాదికి 350 కోట్లు ఖర్చు చేసి ప్రతి పేదింట.. పండుగ సంతోషాన్ని నింపామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ చిరుకానుకే పండగపూట పేదల మనసులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆనాడూ రాష్ట్రంలో వచ్చిన ఆ స్పందన చూసిన, టీడీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం కూడా సంక్రాంతి కానుకల పంపిణీ ప్రారంభించిందన్నారు. అలాంటిది నేటి ప్రభుత్వం పేద ప్రజల పట్ల కనీసం ఆలోచన కూడా చెయ్యకపోవడం వారికున్న అప్రాధాన్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. నాటి ప్రభుత్వంలో 58.29 లక్షల మంది రైతులకు 15,279 కోట్ల రుణమాఫీ చేసినా, అన్నదాత సుఖీభవ పథకం తీసుకువచ్చినా, పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అమలు చేసినా వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే మా ఆలోచన అని తెలిపారు.
అనంతరం రైతు రథం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీలతో రైతన్నలకు తోడుగా నిలిచామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ విదేశాల నుండి స్వగ్రామాలకు తరలి వస్తున్న ప్రజలు.. వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన మీరు గ్రామాభివృద్దికి మీ వంతు సహాయం చేయాలని కోరుతున్నానని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ పండగ సందర్భంగా ఆ దిశగా సంకల్పం తీసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి