youth online games: కేఫ్‌లు కేంద్రంగా కాలయాపన చేస్తూ పక్కదారి పడుతున్న యువతను క్రమశిక్షణలో పెట్టడానికి అనంతపురం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ పక్కీరప్ప ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా, తాడిపత్రి డీఎస్పీ చైతన్య అధ్వర్యంలో ప్రత్యేక పోలీసులతో గుత్తి పట్టణంలోని పలు కేఫ్‌లు, దాబాలలో దాడులు జరిపారు. చరవాణులలో పబ్జీ, రమ్మి వంటి నిషేధిత గేమ్స్ ఆడుతున్న 20 మంది యువకులతో పాటు టీ దుకాణ యజమానులును సైతం అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ గుత్తి పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
గేమింగ్, న్యూసెన్స్ యాక్ట్ కింద పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసిన అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటికి పంపారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం నిషేధిత గేమ్‌లు ఆడటం, బెట్టింగ్‌కు పాల్పడటం, అలాగే ఆడించడం నేరమని తెలిపారు. కేఫ్ నిర్వాహకులు వారి వ్యాపారం నిర్వహించుకోవడం కోసం ఉచిత వైఫై (WI-FI) సౌకర్యం కల్పించి యువకులను కూర్చోబెట్టుకుని ఇలా గేమ్స్ ఆడించడం నేరమన్నారు. ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు సైతం బెట్టింగ్ గేమ్స్ ఆడించరాదని పేర్కొన్నారు. ఇలా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Crime News: పేకాటశిబిరంపై పోలీసుల దాడి.. తిరగబడ్డ పేకాటరాయుళ్లు !