Groundnut Farmers Removing Crop: అనంతపురం జిల్లాలో వర్షాలు లేక రైతులు వేరుశెనగ పంటను తొలగిస్తున్నారు. ఏటా అతివృష్టి, అనావృష్టి వల్ల భారీగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది తీవ్ర దుర్భిక్షం (Extreme Drought Conditions in Anantapur District) నెలకొంది. ఖరీఫ్ ప్రారంభం నుంచి వర్షాలు కురవకపోవడంతో రైతులు వేలాది రూపాయలు వెచ్చించి వర్షాధారం కింద సాగుచేసిన వేరుశెనగ, పత్తి, జొన్న, సజ్జ, కంది, ఉలవ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు గ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొందని రాయదుర్గం నియోజకవర్గంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం గడిస్తే ఎండలకు వేరుశనగ మొక్కలు పూర్తిగా ఎండిపోయి పశువులకు కూడా మేత లభించనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో రాయదుర్గం నియోజకవర్గంలోని రైతులు వేరుశనగ పంటను తొలగిస్తున్నారు. విత్తిన నాటి నుంచి వర్షం లేక మొక్కలు మొలిచి ఎండిపోయాయని పేర్కొన్నారు. వేరుశనగ మొక్కలకు ఒకటి, రెండు కాయలు కూడా లేక ఖాళీగా ఉండటంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం: చాలా సంవత్సరాలుగా ఇలాంటి కరవు పరిస్థితులు చూడలేదని వృద్ధులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 5 లక్షల 77 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం ఈ ఏడాది 3 లక్షల 5 వేల ఎకరాల్లో మాత్రమే వేరుశనగ పంట సాగు అయ్యింది. 2022 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో ఐదు లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు. ఈ ఏడాది రెండు లక్షల ఎకరాలకు పైగా వేరుశెనగ సాగు తగ్గిపోయింది.
జిల్లాలో రైతులు వేరుశనగ పంట వేయడానికి ధైర్యం చేయడం లేదు. వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీలతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో వేరుశెనగ సాగు విస్తీర్ణం సాధారణంగా 41 వేల 884 హెక్టార్లు కాగా, ఈ సంవత్సరం 34 వేల 727 హెక్టార్లలో వేరుశెనగ సాగైంది.
పట్టించుకోని అధికారులు: జిల్లాలో కరవు పరిస్థితులపై కనీసం అధికారులు పంటలను పరిశీలించడానికి కూడా రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఉన్నతాధికారులు వేరుశెనగ పంట పొలాలను పరిశీలించి.. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గే మాట్లాడుతూ జిల్లాలో ఏర్పడిన కరవు పరిస్థితిపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.