అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం వీరాపురం గ్రామంలో వేరుశనగ పంట పొలాలను స్థానిక రైతులతో కలిసి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. వేరుశనగ పంట సాగు చేసిన రైతుల సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఎకరా పంట సాగు చేయడానికి దాదాపు రూ. 15,000 వరకు ఖర్చు పెట్టామని ఈ సందర్భంగా రైతులు బదులిచ్చారు. తమకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోయారు.
భారీగా పంట నష్టం..
అనంతపురం జిల్లాలో సుమారు 12 లక్షల 26 వేల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట నష్టపోయారని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. జిల్లాలో రూ.1850 కోట్లు రైతుల విత్తనం కోసం పెట్టుబడి పెట్టి పూర్తిగా కుదేలయ్యారన్నారు.
సుమారు రూ.3 వేల కోట్ల నష్టం..
రైతులు సుమారు మూడువేల కోట్ల వేరుశనగ పంట నష్టపోయినా సర్కార్ స్పందించకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులు పంటలు కోల్పోయినప్పటికీ పంటలు బాగున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారని కాల్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయకత్వంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : 'ఆ రోజున అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి కావాలి'