రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు దగా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు. రైతు దగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో వ్యవసాయ పొలం బైఠాయించి... రైతు దగా దినోత్సవాన్ని నిర్వహించారు.
వైకాపా నాయకులు పేపర్లలో ప్రకటనల కోసమే రైతు దినోత్సవం జరుపుతున్నారని పరిటాల సునీత విమర్శించారు. నిజానికి ఇది రైతు దగా దినోత్సవమనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలని చెప్పారు. అనంత జిల్లా రైతాంగాన్ని అష్టకష్టాలకు గురి చేశారని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సీఎం జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.30వేలు, ఉద్యాన రైతులకు హెక్టారుకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని చెప్పారు.
ఇదీ చదవండి: