Fire in municipal dumping yard : అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘం డంపింగ్ యార్డ్‌లో కొద్ది రోజులుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీంతో పట్టణంలోని పార్వతి నగర్, శాంతినగర్, నేసేపేట, గౌడ లే అవుట్ ప్రాంతాల ప్రజలు, బళ్లారి ఆర్ అండ్ బి ప్రధాన రహదారిలో రాక పోకలు సాగించే ప్రయాణికులు, అక్కడ ఉండే ప్రజలు కంపోస్ట్ యాడ్ నుంచి వచ్చే పొగ, కాలుష్యము, వాసన నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని తెలిపారు. డంపింగ్ యార్డ్ చెత్తకు గత 15 రోజుల క్రితం ఒకసారి నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. అప్పుడు వాటిని మున్సిపల్ అధికారులు, రాయదుర్గం అగ్నిమాపక శకటం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. కంపోస్ట్ యార్డులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చెందిన చెత్త సేకరణ లారీ మంటల్లో కాలిపోయింది. దీని వల్ల పురపాలక సంఘానికి దాదాపు రూ 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. చెత్త సేకరణ లారీ మంటల్లో కాలిపోవడంతో రాయదుర్గం పట్టణంలో చెత్త సేకరణ, చెత్త తొలగింపు కార్యక్రమాలు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనారోగ్యం బారిన ప్రజలు.. గత పక్షం రోజుల వ్యవధిలో మూడుసార్లు డంపింగ్ యార్డ్‌లో భారీ మంటలు అంటుకొని పట్టణం అంతటా దట్టమైన పొగ దావానలంలో వ్యాపించింది. దీంతో అక్కడి ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధులకు గురవుతున్నారు. వాతావరణం కలుషితమై పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. గత రెండు రోజులుగా కంపోస్ట్ యార్డులో మళ్లీ భారీగా మంటలు వ్యాపించడంతో కర్ణాటకలోని బళ్ళారి, మొలకాల్మూర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్ ప్రాంతాలకు చెందిన 6 అగ్నిమాపక శకటాలు రాయదుర్గం చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కంపోస్ట్ యార్డ్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అదుపులోకి రావడం లేదు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డంపింగ్ యార్డ్‌ను పర్యవేక్షించి మంటలను త్వరితగతిన ఆర్పి వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంపోస్ట్ యార్డు నుంచి వచ్చే వాసన, పొగ భరించలేక పోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు డంపింగ్ యార్డ్‌లో మంటలను పూర్తిగా ఆర్పి పర్యావరణ పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదివండి :