అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30వేలు దాటిపోయింది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 229 మంది మృతి చెందారు. 25 వేల మంది ఇంటికెళ్లగా, మరో ఐదు వేల మంది వరకు రోగులు ఆసుపత్రుల్లో, ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. వైరస్ గురించి తొలిరోజుల్లో అపోహలతో మానవత్వం కోల్పోయిన సంఘటనలు అనేకం చూశాం.
గతంలో అనంతపురం నగరంలో ఓ అపార్టుమెంట్లో నివసించే వైద్యుడు రోగులకు వైద్యం అందిస్తూ వైరస్ బారినపడ్డాడు. ఆ వైద్యుడికి ధైర్యం చెప్పాల్సిన అపార్టుమెంట్‌లోని కుటుంబాలు... ఇంట్లో నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లటానికి వందల సార్లు అధికారులకు ఫోన్ చేయడం.. ఆ వైద్యుడి కుటుంబాన్ని కలచివేసింది. ఈ వివక్ష ఒక్క నగరాలకే కాదు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించటంతో మానవత్వం మంటగలిసిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ధర్మవరంలో వైరస్‌కు గురైన దంపతులు చికిత్స తీసుకొని ఆరోగ్యవంతులుగా ఇంటికెళ్లారు. అక్కడి వరకు అంతా బాగా ఉన్నప్పటికీ, ఇరుగుపొరుగు వారి ఆదరణ కోల్పోయిన ఆ దంపతులు వారి ఇంటి భవనం పైనుంచే దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన అందర్నీ కలచివేసినప్పటికీ, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు తీసుకోలేకపోయారు.
ఆసుపత్రులు, వైద్యం ఎంత మెరుగ్గా ఉన్నా, వాటి గురించి ఎంత ప్రచారం చేసుకున్నా, వైరస్‌తో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికెళ్లిన వారి పరిస్థితి మాత్రం మామూలుగా ఉండటంలేదన్న విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్‌ను జయించినప్పటికీ ఇరుగుపొరుగు వారి పలకరింపులు కోల్పోయిన అనేక మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చికిత్స పొంది ఇంటికి వెళుతున్న వారు, మరి కొంత కాలం ఆసుపత్రిలోనే ఉంటే బాగుండేదని బాధితులు భావించేలా గ్రామాల్లో మానవత్వం కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. మార్పు రావాలి...పోరాడాల్సింది వ్యాధితో కాని వ్యక్తితో కాదని చెబుతునే ప్రజలు గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి