తొలకరి వర్షాలు జోరుగా కురవడంతో ఈసారి పంటలు సకాలంలో వేయవచ్చన్న రైతన్నల ఆశలు అడియాసలే అయ్యాయి. తొలుత జోరుమీదున్న వానలు ఆ తర్వాత ముఖం చాటేయ్యడంతో ఈసారి ఖరీఫ్ సాగు ఆలస్యం కానుంది. ఏటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో పెద్దఎత్తున వానలు కురిసి విత్తనాలు విత్తుకునేవారు. కానీ ఈసారి జూన్ తొలి వారంలో వర్షాలు కురిసినా మళ్లీ వాన జాడ లేదు. దీంతో పంటకోసం పొలాలు సిద్ధం చేసినా భూమిలో తేమ లేకపోవడంతో విత్తనాలు విత్తకుండానే రైతులు వరుణుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సిద్ధం చేసిన భూమిలో కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో వర్షాలు కురిసి ఉంటే అనంతపురం జిల్లాలో ఇప్పటికే కంది, వేరుశనగ, తృణధాన్య పంటలు విత్తుకునేవారు. కొన్నిచోట్ల తొలుత కురిసిన వర్షాలకు 12 వందల హెక్టార్లలో వేరుశనగ విత్తనం వేసినప్పటికీ ఇరవై రోజులుగా వాన లేకపోవటంతో మొలకలు రాలేదు. జూన్ నెలలో 63.9 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా తొలి వారంలోనే రెండు, మూడు రోజుల్లో కురిసిన కుండపోత వానతో 107 శాతం కురిసినట్లుగా నమోదైంది. గణాంకాలు అదనపు వర్షపాతం చూపిస్తున్నా రైతులు విత్తనం వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
సకాలంలో పంటలు వేస్తే అక్టోబర్, నవంబర్‌లో వచ్చే తుపానుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా వేసే విత్తనంతో పంటలపై చీడ, పీడల బెడద కూడా ఎక్కువగా ఉండనుంది. నేల బాగా పదునయ్యే వర్షం కురిస్తేనే రైతులు విత్తనం వేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇదీచదవండి.