విత్తనాలు కోసం రైత్నన పడుతున్న వెతలు అన్నీఇన్నీ కావు. వర్షాల కోసం మొన్నటి వరకు ఆందోళన చెందిన రైతులు ఇప్పుడు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురుస్తున్నాయని... ఆశగా విత్తన విక్రయ కేంద్రాల వద్దకు వెళ్లిన అన్నదాతకు తిప్పలు తప్పడం లేదు. పడిగాపులు కాయాల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు అన్న తేడా లేకుండా వరుసలో పాసు పుస్తకాలు పట్టుకుని నిలబడాల్సి వస్తోంది.
అనంతపురం జిల్లాలో పలుచోట్ల విత్తన పంపిణీ ప్రారంభం కాగా... ఉదయం నుంచే పలు గ్రామాలకు చెందిన రైతులు మండల కేంద్రాలకు చేరుకున్నారు. అయితే విత్తనాల్లేవని అధికారుల నుంచి వస్తున్న సమాధానం రైతుకు ఆగ్రహం తెప్పిస్తోంది. ధర్మవరం, కుందుర్పి, చెన్నెకొత్తపల్లి, రాయదుర్గం రైతులు ఆందోళన బాటపట్టారు. మార్కెట్ యార్డుల ఎదుట నిరసనకు దిగారు. బత్తలపల్లిలో చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించారు. వ్యవసాయ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని... వేరుశెనగ విత్తనాలు కర్ణాటకకు తరలిస్తున్నారని ఆరోపించారు.
రాప్తాడు నియోజకవర్గం చెన్నెకొత్తపల్లి మండలం వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులు వేరుశెనగ విత్తనాల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెల్లవారు జామున 6 గంటలకే వచ్చి క్యూ కట్టారు. 3 రోజులుగా వేరుశెనగ పంపిణీ జరగనందున ఆందోళనతో ఉన్న రైతులు పాసు పుస్తకాలు పట్టుకొని బారులు తీరారు. ఈ క్రమంలో.. వృద్ధులు కొందరు సృహ తప్పిపడిపోయారు.
కడప, చిత్తూరు జిల్లాల్లోనూ విత్తనాల కోసం రైతులకు అవస్థలు తప్పలేదు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఉదయం నుంచే పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో ఉన్నా.. అధికారులు కనిపించడమే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచడం పోలీసులకు సవాలుగా మారింది.
ఉత్తరాంధ్ర జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో విత్తనాల కోసం వర్షాన్ని లెక్కచేయకుండా గొడుగులతో భారీగా క్యూలైన్లలో నిలబడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో విత్తనాలు పూర్తి స్థాయిలో అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.