Farmers Stopped CM Convoy : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల నుంచి తీవ్రస్థాయి నిరసన సెగ తగిలింది. భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదంటూ కడుపు మండిన రైతులు.. నేరుగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లికి ముఖ్యమంత్రి వాహనశ్రేణి రాగానే.. రోడ్డు మధ్యలోకి వచ్చి వాహనాలు ఆపేశారు. వెంటనే అప్రమత్తమైన సీఎం కాన్వాయ్‌లోని భద్రతాధికారులు, పోలీసులు.. కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన రైతులను పక్కకు ఈడ్చి పారేశారు. ఆ తర్వాత అదే వేగంతో సీఎం కాన్వాయ్ ముందుకు వెళ్లింది.
పేదల ఇళ్ల స్థలాలకు భూములు ఇస్తే తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 210 ఎకరాల స్థలాలను ఇళ్ల కోసం ఇస్తే.. తమకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నార్పల నుంచి పుట్టపర్తికి రోడ్డు మార్గంలో వస్తున్న విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. తమకు పరిహారం చెల్లించనందుకు నిరసనగా రైతులు రహదారిపై పోర్లు దండాలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
తమ బాధను అధికారులు పట్టించుకోవటం లేదని.. ఎక్కడ సభ జరిగితే అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారని రైతులు వాపోయారు. ఎక్కడ సభ జరిగినా వెళ్లామని.. చివరకు విజయవాడకూ వెళ్లినట్లు తెలిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నించగా.. కుదరలేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రి ప్రాంతంలో 210 ఎకరాల భూములు సేకరించిన అధికారులు.. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదంటూ రైతులు వాపోయారు. పరిహారం ఇప్పించడంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని తీవ్ర ఆవేదన చెందారు.
ఇవీ చదవండి :