అనంతపురం జిల్లా యూడికి మండలం నగరూరుకు చెందిన యువరైతు రమణారెడ్డి(28) విద్యుదాఘాతంతో మృతి చెందాడు.రమణా రెడ్డికి 15 ఎకరాల భూమి ఉంది. అందులో 5 బోరు బావులు ఉన్నాయి. ఆ బోరు బావుల కింద అరటి, కుసుమ పంటలు సాగుచేస్తున్నాడు. తన పోలంలో కరెంట్ స్తంభంపై మరమ్మత్తుల కారణంగా ఎల్సీ కావాలని లైన్మెన్ను సంప్రదించాడు. ఆ తోటల సమీపంలోనే ఓ గుత్తేదారుడు కొత్త విద్యుత్ నియంత్రికల మార్పుకోసం ఎల్సీ తీసుకున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు పని చేసుకోవచ్చని లైన్మెన్ తెలపడంతో రమణారెడ్డి స్తంభం పైకి ఎక్కి మరమ్మత్తులు చేపట్టాడు.
ఎల్సీ తీసుకున్న గుత్తేదారుడు తన పని పూర్తైందని చెప్పడంతో లైన్మెన్ విద్యుత్‌ని పునరుద్ధరించాడు. రమణారెడ్డి స్తంభంపై ఉండగానే విద్యుత్ సరఫరా జరగడంతో విద్యదాఘాతానికి గురై స్తంభంపైనే అతను మృతి చెందాడు. ఇది గమనించిన తోటి రైతులు విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియచేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. అనంతరం రమణారెడ్డి మృతదేహాన్ని కిందికి దించారు. లైన్మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రమణారెడ్డి మృతి చెందాడంటూ బంధువులు..విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: