వార్డు వాలంటీర్ పేరుతో ప్రజల వద్ద నుంచి నగదు దోచుకుంటున్న ఓ నకిలీ వాలంటీర్.. చివరికి అసలు వాలంటీర్కే చిక్కాడు. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మపాలెం కాలనీకి చెందిన వెంకటేశ్ అనే యవకుడు చికెన్ పకోడా బండి వ్యాపారాన్ని చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాందించాలని భావించి మరో ఇద్దరు యువతులతో కలిసి నకిలీ వార్డు వాలంటీర్ల అవతారమెత్తాడు. పట్టణంలోని పలు కాలనీలు తిరుగుతూ తాము వార్డు వాలంటీర్లమని ప్రచారం మొదలు పెట్టాడు. 'మీ పింఛను సొమ్ము పొకుండా ఉండాలన్నా, కొత్త పింఛన్లు కావాలన్నా ఒక్కో దరఖాస్తుకు కొంత రుసుం చెల్లించాలి' అంటూ వసూళ్లు మొదలుపెట్టారు.
డామిట్... కథ అడ్డం తిరిగింది..!
ఇలా వారం రోజులుగా పట్టణంలోని ఐదు వార్డుల్లో డబ్బులు వసూలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు 300 నుంచి వెయ్యి రూపాయల వరకు దండుకున్నారు. ఇలా వసూలు చేసుకుంటూ వెళుతూ ఆ వార్డులోని అసలైన వార్డు వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్లి మాయ మాటలు చెప్పడం ప్రారంభించారు. వెంటనే సదరు నిజమైన వాలంటీర్... పురపాలక అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే లోపు నకిలీ బృందంలో ఉన్న ఇద్దరు యువతులు గమనించి పక్కకు జారుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన వెంకటేష్ అడ్డంగా ఋక్కైపోయాడు. అతని నుంచి 60 దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు. పురపాలిక అధికారులు వెంకటేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: