కృష్ణా జిల్లా పోలీసులు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఘరానా దొంగల్నిఅరెస్టు చేశారు. ఇద్దరి ఊరు పేరు వేరైనా ఇద్దరి పంథా దందాలే.
స్మార్ట్ ఫోన్లో వార్తలు చూసి...
అనంతపురం జిల్లా వెలమద్దికి చెందిన రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్ మంగలి శ్రీను..... సీమలో గొలుసులు, బైకులు కొట్టేయడం, ఇళ్లు దోచేయడం వంటి 17 కేసుల్లో..ముద్దాయిగా ఉన్నాడు. 2009 నుంచి 2013వరకూ కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. జైలు నుంచి వచ్చాక చేతికి మట్టి అంటకుండా స్మార్ట్ ఫోన్లో వార్తలు చూసి.. స్మార్ట్‌గా మోసాలు చేయడం మొదలెట్టాడు. వెబ్‌సైట్లలో వచ్చే నేర వార్తలు చూసి..నిందితులకు ఏసీబీ అధికారినంటూ ఫోన్ చేస్తాడు. ఇటీవలే పెడన మండల పీఆర్‌ఏఈ.. ఏసీబీకి చిక్కగా... ఏసీబీ డీఎస్పీనంటూ వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లక్ష వసూలు చేశాడు. మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే వార్తను...అడ్డంపెట్టుకుని అనకాపల్లిలో ఓ ప్రధానోపాధ్యాయుడి వద్ద.....50వేలు వసూలు చేశాడు. అవినీతి కేసుల్లో సస్పెండైన జైలు వార్డెన్లు, ఎస్సైలకు ఏసీబీ అధికారినంటూ.. ఫోన్ చేసి వసూళ్లకు పాల్పడిన సందర్భాలు చాలా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
మంగలి శ్రీను ఒక సీజనల్ నేరగాడు. 20ఏళ్లుగా ఇలాంటి దందాలు చేస్తున్నాడు. ఇతను అన్ని తాజా వార్తలు...ఫాలో అవుతాడు. ఎక్కడైనా అ.ని.శా. సోదాలు జరుగుతున్నాయనే సమాచారం వస్తే చాలు...కుటుంబ సభ్యుల్ని సంప్రదించి డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేస్తాడు. - మల్లిక గార్గ్, కృష్ణాజిల్లా ఏఎస్పీ
ఏకంగా మున్సిపల్ కమిషనర్‌నే బెదిరించాడు!
అనంతపురం జిల్లా కొట్టాలపల్లికి చెందిన.. మరో నిందితుడు జయకృష్ణదీ అదే దందా.! పోలీస్ అధికారినంటూ... ఏకంగా పెడన మున్సిపల్ కమిషనర్‌నే బెదిరించాడు. గత పదేళ్లలో 25కుపైగా కేసులు జయకృష్ణపై ఉన్నాయి. నేరానికొక ఫోన్ నంబర్ ఉపయోగిస్తాడు. నెల్లూరు జైల్లో శిక్ష కూడా అనుభవించి బయటికొచ్చాకా మారలేదు.. ఈ రకంగా ఎవరైనా బెదిరిస్తే.. భయపడకుండా.. తమను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇళ్ల స్థలాలకు 3.79 లక్షల కుటుంబాల ఆసక్తి